వలస కార్మికులను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ.. సీపీఐ రాజ్‌భవన్ ముట్టడికి యత్నించింది. యంఎస్ మక్తాలో వలస కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్న సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి పార్టీ శ్రేణులు రాజ్‌భవన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా పోలీసులు, సీపీఐ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. వలస కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు పోలీసులు చర్యలు చేపట్టడం వల్ల సీపీఐ నేతలు తమ ఆందోళనను విరమించారు. వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నియోజకవర్గమైన మక్తాలో వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. వాళ్ల సమస్యలను పరిష్కరించడంలో కిషన్‌రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. శ్రామిక రైళ్లు ఏర్పాటు చేసి వలస కార్మికులను స్వస్థలాలకు పంపుతున్నామంటున్న నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్... తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఎందుకు మిగిలిపోయారో సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. స్వస్థలాలకు వెళ్లేందుకు పేర్లు నమోదు చేసుకుని 20 రోజులైనా.. ఎందుకు ఆలస్యం జరుగుతోందని ప్రశ్నించారు.