CPI Leaders on Telangana Merger Day: దేశానికి కావాల్సింది డబుల్ ఇంజిన్ సర్కారు కాదని.. భిన్నత్వంలో ఏకత్వం, సమైక్యతను అందించే ప్రభుత్వం కావాలని సీపీఐ(CPI) ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. మతతత్వం పేరుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు భారత్ పేరును ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభను నిర్వహించారు. సీపీఐ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ సభలో పాల్గొన్నారు. కమ్యూనిస్టులు చరిత్రలో భాగస్వాములు కాదని.. చరిత్ర సృష్టించిన వాళ్లని రాజా అన్నారు.
"రాష్ట్ర ప్రభుత్వం విలీన దినోత్సవం చేసేందుకు వెనకాడుతోంది. సీఎం కేసీఆర్ సమైక్యతా దినోత్సవంగా చేయాలని పిలుపునిచ్చారు. దీనికి కమ్యూనిస్టులు అంగీకరించరు. ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతు ఇవ్వలేదు అలా అని ఇండియా కూటమికి మద్దతు ఇవ్వలేదు. భవిష్యత్తులో ఎవరు నెగ్గితే వారికి మద్దతు ఇవ్వొచ్చు అనే ధోరణిలో ఉంది. చంద్రబాబుని అరెస్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్రలో ఏమి చేస్తున్నారో.. అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అదే అమలు చేసేందుకు బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది." - సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి
Koonamneni Sambasiva Rao Latest Comments on KCR: స్వాతంత్ర పోరాటంలోనూ.. సాయుధ రైతాంగ ఉద్యమంలోనూ కమ్యూనిస్టులు ముందుండి నడిపించారని.. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్, జనసంఘ్ ఎక్కడ ఉన్నాయని రాజా ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రస్తుతం అధికారపక్షంలోనూ, ప్రతిపక్షంలోనూ చేరకుండా ఉందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారి సరసన చేరేందుకు కేసీఆర్ ఈ వ్యూహం అవలంబిస్తున్నారని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఏపీలో చంద్రబాబును(Chandrababu) సీఎం జగన్తో అరెస్ట్ చేయించిన బీజేపీ.. ఆ తర్వాత జగన్ ప్రభుత్వంపైనా కన్ను వేస్తుందని.. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపర్చడమే బీజేపీ లక్ష్యమని ఆయన విమర్శించారు. ఎంఐఎంకు భయపడే కేసీఆర్ విలీన దినోత్సవాన్ని నిర్వహించలేదని రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుఅన్నారు.