వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఉద్యమాన్ని భాజపా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి ఆక్షేపించారు. మండీల్లో వ్యాపారాలు చేసే వారే ఉద్యమం నడుపుతున్నారన్న భాజపా నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు. రోజుకు రూ.3,600 కోట్ల నష్టం వస్తోందని అసోచామ్ లాంటి సంస్థలు చెబుతున్నప్పటికీ కేంద్ర వైఖరిలో మార్పు రావడం లేదని ధ్వజమెత్తారు. దిల్లీలో సాగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఐదో రోజు జరిగిన నిరవధిక నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఆయన పాల్గొన్నారు.
"దిల్లీ సరిహద్దు ఉద్యమంలో దళారులు తప్ప రైతుల్లేరంటూ హైదరాబాద్‌లో హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చేసిన ఆరోపణలు అర్థరహితం. చర్చల పేరిట రైతు సంఘాల్లో చీలికలు తీసుకొస్తున్న దృష్ట్యా ప్రధానిపై రైతులకు ఏ మాత్రం విశ్వాసం లేదు. ఆరుగాలం శ్రమించి తాము పండించిన పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చంటున్నారు. తన గ్రామం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండి వద్దకు వెళ్లి అమ్ముకోలేని అన్నదాత.. పక్క రాష్ట్రం వెళ్లి విక్రయించుకోగలడా? మొక్కవోని ధైర్యం, పట్టుదలతో దిల్లీ సహా దేశవ్యాప్తంగా సాగుతున్న రైతు ఉద్యమానికి సీపీఐ మద్దతు ఉంటుంది. సాగు చట్టాల రద్దు, విద్యుత్ సవరణ బిల్లు వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం సాగుతుంది. "