భూదాన్ యజ్ఞ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని... వీటిని పేదలకు పంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన నిరసన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. నైజాం రాజు సర్ఫేఖాజ్ హైదరాబాద్ భూములను తన అవసరాల కోసం పెట్టుకున్నాడని చాడ పేర్కొన్నారు. మొట్టమొదట ప్రపంచంలోనే దున్నేవాడికి భూమి అని నినాదం సీపీఐ పార్టీ ఇచ్చిందని... హైదరాబాద్ నుంచి వచ్చిన నినాదం దేశం మొత్తం వ్యాపించి భూమి, భుక్తి, బతుకు పోరాటంగా మారిందన్నారు. 1936లో భూముల సర్వే జరిగిందని... అప్పటి నుంచి ఇప్పటివరకు భూముల సర్వే జరగలేదని తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్ భూములన్నీ ఎమ్మెల్యేలు, ఎంపీల చేతికి వెళ్లాయని ఆయన ఆరోపించారు.
భూదాన్ భూములను పేదలకు పంచాలి: చాడ వెంకట్‌రెడ్డి
భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని.. వాటిని పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిరసన ధర్నా చేపట్టారు. అన్యాక్రాంతం అయిన భూములను ఆక్రమించిన వారి నుంచి స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణలో పేదల పక్షపాతిగా... గరీబులకు అండగా ఉండి పది లక్షల ఎకరాల భూమిని పంచిన ఏకైక పార్టీ ఎర్రజెండా అని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. కౌలుదారు చట్టం, వక్ఫ్ బోర్డు చట్టం ,భూదాన్ చట్టం భూములకు సంబంధించిన ఏ చట్టమైన కమ్మూనిస్టుల వల్లే వచ్చిందని... ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. విద్యుత్ చట్టం చేసి కూడా ప్రైవేటు పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని... దీనిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపారు. భూదాన్ భూముల అన్యాక్రాంతం అయ్యాయని... ఆక్రమించిన వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని కోరారు. ఆక్రమించిన భూములు ఎక్కడ ఉంటే అక్కడ ఎర్ర జెండా పాతి జైలుకైనా వెళ్లడానికి సిద్ధమేనని చాడ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: తెరాస రైతులను పక్కదారి పట్టిస్తోంది: ఎమ్మెల్సీ రామచందర్‌రావు