లాక్డౌన్ నేపథ్యంలో వలస, అసంఘటిత కార్మికులు, నిరు పేదలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఇదే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ... హైదరాబాద్ హిమాయత్ నగర్లోని ఏఐటీయూసీ భవన్ ముందు నిరసన దీక్ష చేపట్టారు. లాక్డౌన్ ప్రకటించిన ప్రభుత్వాలు కనీస సహాయక చర్యలు చేపట్టక పోవడం దారుణమని చాడ విమర్శించారు.
పేద ప్రజలను ఆదుకోకపోతే తిరుగుబాటు తప్పదు: చాడ - వలస కార్మికుల ఇబ్బందులు
కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో వలస కార్మికులను బజారు పాలు చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కనీస సహాయక చర్యలు చేపట్టక పోవడం దారుణమని చాడ విమర్శించారు.
వలస కార్మికుల విషయంలో బాధపడుతున్నానని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ ఆత్మవిమర్శ చేసుకోవాలని చాడ హితవు పలికారు. నాలుగు కోట్ల మంది వలస కార్మికుల భవిష్యత్ ఏమిటి అని ప్రశ్నించారు. వారి కోసం కమిషన్ వేయడం కాదు... చేతల్లో చూపించాలని కోరారు.
ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల కోట్ల ప్యాకేజీలో ఒక్క పైసకూడా పెద వారికి చేరలేదన్నారు. ఆరు నెలల పాటు ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఎంత మంది లబ్ధిదారులకు రేషన్, రూ.1,500 నగదు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న వివిధ వర్గాల ప్రజలను ఆదుకోవాలని... లేనిపక్షంలో తిరుగుబాటు తప్పదని చాడ హెచ్చరించారు.