Budget 2022-23: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గాలిలో మేడలు కట్టినట్లుగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. రెండేళ్లుగా కరోనా మహమ్మారితో ఆర్థికంగా చితికిపోయిన పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర బడ్జెట్ పూర్తిగా విఫలమైందన్నారు. పీఎం గతిశక్తి పేరుతో 25 ఏళ్ల ఆర్థికాభివృద్ధికి.. ఈ బడ్జెట్ పునాది అనడం హస్యాస్పదంగా ఉందని చాడ విమర్శించారు. ఒక వైపు మునుపు ఎన్నడూ లేనివిధంగా జీఎస్టీ వసూళ్లు పెరిగిందని.. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిరేటు సాధిస్తున్నామని చెప్పిన కేంద్రం, ఆ ఫలాలను సామాన్యులకు అందించడంలో మొండి చెయ్యి చూపిందని దుయ్యబట్టారు.
ఏడాదిపాటు దిల్లీ సరిహద్దులో ఉద్యమించిన రైతుల ప్రధాన డిమాండ్ పంటలకు కనీసమద్దతు ధరపై బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోవడం కర్షకులను కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేయడమే అన్నారు. అన్ని వర్గాల ప్రజల నడ్డివిరుస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోవడం దురదృష్టకరమని చాడ పేర్కొన్నారు. తెలంగాణలో ఒక సాగునీటి ప్రాజెక్టు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుప్యాక్టరీ, తదితర విభజన హామీలను బడ్జెట్‌లో పేర్కొనకపోవడం మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు.
విభజన చట్టంలో హామీలు ఏమయ్యాయి..
కేంద్రం ప్రవేశపట్టిన బడ్జెట్ తెలంగాణకు ద్రోహం చేసేదిగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ నిరసనలకు పిలుపు నిచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రం తాజా బడ్జెట్‌లో అవసరమైన చర్యలు చేపట్టలేదని ఆయన ఆక్షేపించారు. హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ నిర్మాణానికి ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారని... కానీ ఈ రోజేమో గుజరాత్‌లో గిఫ్ట్ సిటీ కేంద్రంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ పని చేస్తుందని బడ్జెట్ సాక్షిగా ప్రకటించటం తెలంగాణ ప్రజలను మోసగించటమే అవుతుందన్నారు.