అవయవ దానం చేసిన వారంతా దేవుళ్లతో సమానమని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 82 మంది అవయవ దానం చేశారని తెలిపారు. 308 మంది పునర్జన్మ పొందారని వెల్లడించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అవయవ దానం చేసిన వారి కుటుంబసభ్యులు, రోడ్డు ప్రమాదాల్లో ఇతరులను కాపాడిన వారిని సజ్జనార్ సత్కరించారు.
ఈ సందర్భంగా అవయవ దానంపై ఉన్న అపోహలు తొలగిపోవాలని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. చదువుకున్న వారే ఎక్కువగా ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవయవ దానం ద్వారా మరొకరికి పునర్జన్మ ప్రసాదించవద్దని అన్నారు.
మరోవైపు రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఎక్కడో ఓ చోట నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని సీపీ పేర్కొన్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని ఇతరులు పట్టించుకోకపోవడం వల్ల ఎంతో మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడితే.. పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీపీ స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లోనూ పేషెంట్ బిల్లు కట్టమని వేధించరని తెలిపారు.