తెలంగాణ

telangana

ETV Bharat / state

అప్పుడు వరంగల్​... ఇప్పుడు సైబరాబాద్​.. రియల్​ లైఫ్​ సింగం!! - యాదృశ్చికంగా అప్పుడు వరంగల్​... ఇప్పుడు సైబరాబాద్​

సజ్జనార్‌ ఇప్పుడు ఈ పేరే మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతోంది. అప్పట్లో వరంగల్‌ యాసిడ్‌ దాడి ఘటనలో అప్పుడు ఎస్పీగా ఉన్న సజ్జనార్‌ నిందితులకు ఎన్‌కౌంటర్‌తో చెక్‌పెట్టారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సజ్జనార్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. యాసిడ్‌ దాడి నిందితులకు సరైన శిక్ష పడిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అప్పుడు వరంగల్​... ఇప్పుడు సైబరాబాద్​.. రియల్​ లైఫ్​ సింగం!!
అప్పుడు వరంగల్​... ఇప్పుడు సైబరాబాద్​.. రియల్​ లైఫ్​ సింగం!!

By

Published : Dec 6, 2019, 9:17 AM IST

Updated : Dec 6, 2019, 12:24 PM IST

వంట చేస్తుంటే వేలికి కాస్త మంట తగిలితేనే భరించలేనంత నొప్పి కలుగుతుంది. కళ్లల్లో నీళ్లు చిప్పిల్లుతాయి. మరి.. బంగారు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె పరిస్థితీ! ఊహించుకుంటేనే భయం! తలచుకుంటేనే గుండె లోతుల్లో బాధ. తనొక ఉన్నత విద్యావంతురాలు. మూగజీవులకి వైద్యం చేసి, ప్రాణం పోసే మనసున్న మనిషి. ప్రమాదం పొంచి వుందని తెలిసి చెల్లికి ఫోన్‌ చేసి మాట్లాడుతూ ఉండమన్న అమాయకత్వం తనది. అలాంటిది నలుగురు కలియుగ కీచకులు ఆమెపై పడి.. రక్కి.. నోట్లో మద్యం పోసి.. పాశవికంగా అత్యాచారం చేస్తున్నప్పుడు ‘దిశ’ ఎంతగా బాధపడిందో.. ఆ రక్కసుల చేష్టలకు తనెంతగా తల్లడిల్లిందో! జీరబోయిన ఆమె కన్నుల్లోంచి కారిన అశ్రువులకు నేలతల్లి ఎంత విలవిల్లాడిందో.. ఎంత ఆక్రోశించిందో! ఆ కన్నీటి బిందువులే నేడు ఆ మృగాళ్ల పాలిట శాపమయ్యాయి! తప్పించుకుపోతున్న ఆ కర్కశులు పోలీసుల తూటాలకు బలయ్యారు. ‘అమ్మాయిల్ని వేధిస్తే.. అంతు చూడాల్సిందే’ అని కోరుకున్న లక్షల మంది మృగాళ్ల మృతితో ఊరట పొందారు. ఒక నిస్సహాయురాలి కన్నీటి చుక్క ఎన్నడూ వృథాగా పోదని సంతోషం వ్యక్తం చేశారు.

యాసిడ్‌ దాడి నిందితులకు..

అది 2008 డిసెంబర్‌ 10వ తేదీ.. వరంగల్‌లో స్వప్నిక తన స్నేహితురాలు ప్రణీతతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా శాఖమూరి శ్రీనివాస్‌ అనే యువకుడు యాసిడ్‌తో దాడిచేశాడు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు యువతులు హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో స్వప్నిక మృత్యువుతో తీవ్రంగా పోరాడి ఓడిపోయింది. ప్రణీత మాత్రం చికిత్సకు కొంత స్పందిస్తోంది. 48 గంటల్లోనే నిందితుడు శ్రీనివాస్‌తో పాటు అతనికి సహకరించిన బజ్జూరి సంజయ్‌, పోతురాజు హరికృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అప్పట్లో ఈ ఘటనపై ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. నిందితులను ఉరితీయాలని ఉద్యమాలు జరిగాయి. ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా తీవ్రంగా పరిగణించింది.

ఆ రోజు రాత్రి 7 గంటలకు నిందితులను విలేకర్ల సమావేశంలో చూపించారు. కేసు విచారణ పూర్తికాలేదని.. నిందుతులు వాడిన బైకు, యాసిడ్‌ సీసాల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ఈ క్రమంలో అదే రోజు రాత్రి దాడికి వాడిన బైకు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకోవడానికి నిందితులను వరంగల్ నగర శివార్లలోని మూమునూరు విమానాశ్రయం వద్దకు పోలీసులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితులు పోలీసులపై దాడి చేసి ఆయుధాలను లాక్కోవాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నిందితులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో పోలీసులకు ప్రజల నుంచి బలమైన మద్దతు లభించింది. దీనిపై నాటి ఎస్పీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. ‘మేము వారిని కావాలని చంపలేదు.. వారు దాడి చేస్తే ఆత్మరక్షణకు ఎదురుదాడి చేశాము. అసలు వారికి తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకొంటున్నాము’ అని ఆయన వివరణ ఇచ్చారు.

దిశ ఆగ్రహజ్వాలల్లో...

నవంబర్‌ 27వ తేదీ సాయంత్రం దిశ తొండుపల్లి జంక్షన్‌ వద్ద తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి గచ్చబౌలికి వెళ్లారు. ఆమె బైక్‌ పార్క్‌చేయడాన్ని సమీపంలోని ఒక లారీలో ఉన్న నిందితులు మహమ్మద్‌పాషా, శివ, నవీన్‌, చెన్నకేశవులు చూశారు. వారు ఆమె బైకుటైర్‌లో గాలితీసేశారు. రాత్రి 9 గంటల సమయంలో తిరిగి వచ్చిన ఆమె బైకు పంక్చర్‌ కావడంతో నిస్సహాయురాలైంది. ఇదే అదునుగా భావించిన నిందితులు ఆమెకు మాయమాటలు చెప్పి బైకును చేజిక్కించుకొన్నారు. దీంతో ఆమె ఎక్కడికి పారిపోలేని పరిస్థితి నెలకొంది.. అదే సమయంలో ఆమెపై దాడి చేసి అత్యాచారం చేశారు. ఆమె అరవకుండా నోటిలో మద్యం పోశారు. దీంతో బాధితురాలు స్పృహ కోల్పోయింది. చివరికి చటాన్‌పల్లి వంతెన కిందకు తీసుకెళ్లి ఆమెపై పెట్రోల్‌ పోసి దహనం చేశారు.

ఈ ఘటన వెలుగులోకి వచ్చాక నిందితులపై జనాగ్రహం పెల్లుబికింది. దాడికి ముందు బాధితురాలు తన చెల్లికి ఫోన్‌ చేసి భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఫోన్‌కాల్‌ వైరల్‌ అయింది. ఈ సంభాషణ విన్న ప్రతిఒక్కరి హృదయం బాధతో విలవిల్లాడిపోయింది.. నిందితులపై కోపంతో రగిలిపోయింది. నిందితులను షాద్‌నగర్‌ కోర్టులో హాజరుపర్చే సమయంలో జనం నేరుగా చెప్పులు, రాళ్లతో దాడికి దిగారు. తాము బతికున్న దిశ పైనే పెట్రోల్‌ పోసి కాల్చేసినట్లు నిందితులు జైల్లో కిందిస్థాయి సిబ్బంది వద్ద చెప్పినట్లు వార్తలు గుప్పుమన్నాయి. సత్వరన్యాయం కోసం ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని దర్యాప్తును ముమ్మరం చేశారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పర్యవేక్షణలోని దర్యాప్తు బృందం డిసెంబర్‌ 6వ తేదీ తెల్లవారు జామున నిందితులను చటాన్‌పల్లి వంతెన వద్దకు తీసువెళ్లింది.

ఇదే అదునుగా భావించిన నిందితులు పోలీసులపై దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు వారిని ఎన్‌కౌంటర్‌ చేశారు. నాడు వరంగల్‌లో ఎస్పీగా ఉన్న సజ్జనారే నేడు సైబరాబాద్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎంతో యాధృచ్ఛికంగా వరంగల్‌ శివార్లలో జరిగిన ఎన్‌కౌంటర్‌ వంటిదే నేడు నగర శివార్లలో జరిగింది. ఈఘటనపైసాహో సజ్జనార్​ అంటూ ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.''

ఇవీ చూడండి:రాజధాని శివారులో యువ వైద్యురాలి దారుణహత్య

Last Updated : Dec 6, 2019, 12:24 PM IST

For All Latest Updates

TAGGED:

CP SAJJANAR

ABOUT THE AUTHOR

...view details