శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నారని నగర సీపీ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు సామాన్యుల చరవాణులు పరిశీలించడంపై సీపీ అంజనీ కుమార్ వివరణ ఇచ్చారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే పోలీసులు కొన్నిసార్లు పూర్తిస్థాయిలో తనిఖీలు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.
సంఘ విద్రోహ శక్తులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని కుట్రలు పన్నుతున్నాయని సీపీ తెలిపారు. వాట్సాప్లో సందేశాలు ద్వారా నేరాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. నగరంలో పలుచోట్ల పోలీసులు తనిఖీల సందర్భంగా వాహనదారులను ఆపి బ్యాగులతో పాటు కొంతమంది యువకుల చరవాణిలను సైతం పోలీసులు పరిశీలించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో వివాదానికి దారితీశాయి. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను సైతం పోలీసులు హరిస్తున్నారంటూ కొంతమంది సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించారు. అయితే శాంతిభద్రతల పరిరక్షణ కోసం కొన్ని సందర్భాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని అంజనీ కుమార్ తెలిపారు.