తెలంగాణ

telangana

ETV Bharat / state

Vaccination: తెలంగాణలో రెండు కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి - covid vaccine has been completed for two crore people in Telangana state

Vaccination
రాష్ట్రంలో రెండు కోట్ల మందికి కొవిడ్‌ వాక్సినేషన్‌ పూర్తి

By

Published : Sep 15, 2021, 12:19 PM IST

Updated : Sep 16, 2021, 4:01 AM IST

12:06 September 15

Vaccination: తెలంగాణలో రెండు కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి

తెలంగాణలో రెండు కోట్ల మందికి కొవిడ్‌ వాక్సినేషన్‌ పూర్తి

గతేడాది మార్చి నెలలో తొలిసారి రాష్ట్రంలో వెలుగు చూసిన కరోనా వైరస్ ఇప్పటికే రెండు వేవ్​ల రూపంలో ప్రజలను అతలాకుతలం చేసింది. ఆర్థికంగా, శారీరకంగా కుంగదీసింది. వందల మంది చిన్నారులను దిక్కులేని అనాథలుగా మార్చింది. అందరూ ఉన్నా.. కరోనాతో మరణించిన వారికి కనీసం సరైన అంతిమ సంస్కారాలు జరిపే అవకాశం లేని దుస్థితిని తీసుకొచ్చింది. ఈ కష్టాన్ని అడ్డుకునే లక్ష్యంతో ఈ ఏడాది జనవరి నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది. వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తూ.. తెలంగాణ ప్రభుత్వం రెండు కోట్ల డోసుల టీకాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. జనాభా ప్రాతిపదికన చూసినా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా టీకాలు అందించిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ.. నేడు రెండు కోట్ల డోసుల పంపిణీ పూర్తైన సందర్భంగా సీఎస్ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకుంది. అధికారులు కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ ఏడాది జనవరి 16 నుంచి రాష్ట్రంలో కొవిడ్ టీకాల పంపిణీ ప్రారంభం కాగా.. మొదట వైద్యులు, వైద్య సిబ్బందికి  సర్కారు టీకాల పంపిణీ చేపట్టింది. అనంతరం ఫ్రంట్ లైన్ వర్కర్లైన పోలీస్​, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. క్రమంగా టీకాల అందుబాటును దృష్టిలో ఉంచుకుని.. 60 ఏళ్లు పైబడిన వారు లేక 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి టీకాలను అందించారు. విడతల వారీగా రిస్క్ టేకర్స్, 18 ఏళ్లు పైపడిన వారికి టీకాల పంపిణీ చేపట్టి.. వైరస్ వ్యాప్తి కట్టడికి కృషి చేస్తున్నారు.

ప్రణాళికాబద్ధంగా సాగుతోన్న వ్యాక్సినేషన్​లో భాగంగా నేడు రెండు కోట్ల డోసుల మార్కుని చేరినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 16 నుంచి జూన్ 25 నాటికి కేవలం కోటి డోసుల పంపిణీ పూర్తి కాగా.. కేవలం రెండున్నర నెలల వ్యవధిలో మరో కోటి డోసుల పంపిణీ చేయటం వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక ఈ నెల చివరి నాటికి మరో కోటి డోసుల కొవిడ్ టీకాలు పంపిణీ చేసే లక్ష్యంతో పని చేస్తున్నట్టు సర్కారు ప్రకటించింది. రాష్ట్రంలో కనీసం 52 శాతం మందికి కనీసం ఒకడోస్ వ్యాక్సిన్ పూర్తైందని.. జీహెచ్ఎంసీలో దాదాపు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తైనట్టు సీఎస్ ప్రకటించారు.

వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఒక స్థిరమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఈ నెల ఆఖరు నాటికి మరో కోటి డోసులు పంపిణీ చేసి మూడు కోట్ల మార్కును చేరాలని యోచిస్తోంది. ఇందుకోసం అవసరం అయితే గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికీ టీకాలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.  

Last Updated : Sep 16, 2021, 4:01 AM IST

ABOUT THE AUTHOR

...view details