తెలంగాణ

telangana

ETV Bharat / state

Vaccine: రాష్ట్రంలో శరవేగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ - telangana varthalu

రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ప్రభుత్వ కేంద్రాలతోపాటు ప్రైవేటు ఆస్పత్రులు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగుల కోసం టీకా అందించేందుకు చర్యలు చేపడుతున్నాయి. గత నెలతో పోలిస్తే జూన్‌లో వ్యాక్సినేషన్‌ ఊపందుకుంది. నిత్యం లక్ష మందికిపైగా టీకా తీసుకుంటున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

covid vaccination process
రాష్ట్రంలో శరవేగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ

By

Published : Jun 8, 2021, 10:24 PM IST

రాష్ట్రంలో శరవేగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ

కరోనా మహమ్మారి కట్టడి వ్యాక్సినేషన్‌తోనే సాధ్యమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. మూడో దశ వస్తుందన్న ఆందోళనతో ప్రతిఒక్కరికీ టీకాలు అందించాలని సర్కారు యోచిస్తోంది. నాలుగు వారాల నుంచి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. నిత్యం లక్ష మందికిపైగా టీకా తీసుకుంటున్నారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సోమవారం ఏకంగా లక్షా 66 వేల 818 మందికి వ్యాక్సిన్‌ వేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 54 లక్షల 13వేల 379మందికి తొలి డోస్ టీకా పంపిణీ పూర్తైంది. మరో 14 లక్షల 48 వేల 736 మందికి రెండు డోసులు అందించినట్లు వెల్లడించింది.

రోజుకు లక్ష మందికి పైగా...

రాష్ట్రంలో టీకాల కొరత కారణంగా మే 11 నుంచి మొదటి డోసును పూర్తిగా నిలిపివేసిన సర్కారు.... పదిహేను రోజులు నుంచి సెకండ్ డోసు మాత్రమే పంపిణీ చేసింది. ఆ సమయంలో రోజుకి సగటున 30 నుంచి 40వేల మందికి మాత్రమే టీకాలు ఇచ్చింది. టీకా కోసం ప్రజలు ఎదురుచూస్తున్న క్రమంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు టీకాలను అందించేందుకు అనుమతులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల 75 వేల మంది సూపర్ స్ప్రెడర్లను గుర్తించి.. వారికి గత నెల 28 నుంచి టీకాలను అందిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని... ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. ఈనెల 1వ తేదీ నుంచి రోజుకి సరాసరిన లక్షా 17వందల మందికి టీకా అందుతోంది.

వేగం పుంజుకున్న వ్యాక్సినేషన్​

రాష్ట్రానికి మొత్తం 69 లక్షల 36వేల 590 డోసుల టీకాలు అందగా.. అందులో 68 లక్షల 73 వేల 620 డోసులు వినియోగించారు. మరో 0.17శాతం టీకాలు వృథా అయినట్టు ప్రభుత్వం తెలిపింది. 62 వేల 970 డోసులను ఆర్మీకి కేటాయించామని వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిత్యం లక్ష మందికిపైగా టీకా ఇస్తుండటంతో వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంది.

టీకాలు వృథా చేశారు..

మరోవైపు అందుబాటులో ఉన్న టీకా డోసులను సరిగా వినియోగించుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కేంద్రం పేర్కొంది. 2 లక్షల 25 వేల టీకాలను వృథా చేశారని తెలిపింది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటే మరింత వేగంగా వ్యాక్సినేషన్‌ నిర్వహించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details