హైదరాబాద్‌లోని నెహ్రూ జూ లాజికల్ పార్కులో ఎనిమిది ఆసియా సింహాలు కోవిడ్ బారిన పడ్డాయి. సింహాలు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతుండటంతో అప్రమత్తమైన ఆధికారులు సింహాల గొంతు, ముక్కు, శ్వాస మార్గం నుంచి తీసిన సాంపిల్స్‌ను సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయోలజీ- సీసీఎంబీకి పంపించారు. సీసీఎంబీలోని ల్యాబోరేటరీ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ ఎన్ డెంజర్డ్ స్పెసీస్ దీనికి సంబంధించిన పరీక్ష చేయగా ఇవాళ ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే సింహాలకు వచ్చిన కొవిడ్‌కు బయట ఆందోళన కలిగిస్తున్న వేరియంట్లకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ జూ పార్కులో 8 సింహాలకు కొవిడ్
10:05 May 04
హైదరాబాద్ జూ పార్కులో 8 సింహాలకు కొవిడ్
ప్రస్తుతం సింహాలన్ని ఐసోలేషన్‌లో ఉన్నాయని, సింహాలు చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్నట్లు వెల్లడించారు. సాధారణంగానే తింటున్నాయని, ప్రస్తుతం ప్రవర్తన సాధారణంగానే ఉందని పేర్కొన్నారు. జూలో ఉన్న ఇతర జంతువులు విషయంలో అవసరమైన చర్యలు అధికారులు చేపట్టారు. అయితే జూలోకి పర్యాటకులకు అనుమతి ఇప్పటికే నిరాకరించారు.
సింహాలకు కొవిడ్‌తో అప్రమత్తమైన సెంట్రల్ జూ అథారిటీ... అన్ని జూలలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. జంతువులకు కోవిడ్ విషయంలో ముందస్తు చర్యలు, సాంపిల్ కలెక్షన్, పాటించాల్సిన నియమాలపై ఉత్తరప్రదేశ్‌లోని ఇండియన్ వెటర్నరీ రీచర్చ్ ఇనిస్టిట్యూట్, హైదరాబాద్ లోని సీసీఎంబీ ఆధ్వర్యంలోని ల్యాబోరేటరీ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ ఎన్ డెంజర్డ్ స్పెసీస్ సలహాలతో మార్గదర్శకాలు జారీ చేశారు. మరిన్ని మార్గదర్శకాలు నిపుణులతో సంప్రదించి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
గత సంవత్సరం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎదురైన అనుభవనాల దృష్ట్యా.. జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుందన్న దానికి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ విషయంలో మీడియాతో పాటు అందరు బాధ్యతాయుతంగా వ్యవహించాలని ప్రభుత్వం కోరింది.