హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజూ దాదాపు 300 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ కేంద్రాలు తదితర చోట్ల టీకా వేస్తున్నారు. ప్రభుత్వ లెక్క ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 55 లక్షలమందికి మొదటి, రెండో డోసులు వేశారు. ఇందులో 60 శాతం వరకు హైదరాబాద్‌లోనే వేశారు. మహానగరం పరిధిలో చాలా వరకు వ్యాక్సిన్, కరోనా పరీక్షా కేంద్రాలు పక్క పక్కనే ఉన్నాయి. ఒక లైనులో అనుమానితులు నిల్చుంటే వారి పక్కనే టీకా కోసం వచ్చిన వారు నిలబడుతున్నారు.
ఈ సమయంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల టీకాకు వచ్చినవారు మహమ్మారి బారినపడుతున్నారు. కొన్ని చోట్ల టీకా కేంద్రాలను శానిటైజ్ చేయకపోవడంతో ఇవి వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా మారాయన్న భావన ఉంది. దీంతో వైరస్ కారణంగా జ్వరం వచ్చినా కూడా చాలా మంది టీకా వల్ల వచ్చిందన్న భావనలో ఉంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. సాధారణంగా వ్యాక్సిన్ వల్ల వచ్చిన జ్వరం, ఒళ్లునొప్పులు చాలా వరకు ఒక్క రోజుగానీ రెండో రోజుకు తగ్గిపోతాయి. అంతకు మించి ఇబ్బంది కలిగినా అలసత్వం ప్రదర్శిస్తుండడంతో కొందరు ఊపిరితిత్తులు దెబ్బతిని ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.
కుటుంబ సభ్యులకు వస్తే వెంటనే వద్దు.
- టీకా వేయించుకోవడం వల్ల కరోనా వస్తుందన్నది అపోహ. మృతవైరస్‌తో వ్యాక్సిన్ తయారు చేశారు. ఇది మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వైరస్‌తో పోరాడే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది.
- చాలా మంది ఇళ్లలో ఒకరిద్దరు కుటుంబ సభ్యులకు కరోనా వస్తే తాము కూడా ఈ వైరస్ బారినపడే అవకాశం ఉందన్న భయంతో వెంటనే టీకాకు పరుగులు పెడుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఇలా చేయొద్ధు 14 రోజులపాటు వారూ ఐసోలేషన్‌లో ఉండి ఆ తర్వాత వ్యాధి లేదని నిర్ధారించుకున్న తర్వాతే వ్యాక్సిన్ వేయించుకోవాలి.
- టీకా వేయించుకోవడానికి వెళ్లినప్పుడు కూడా కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు మాస్కులను ధరించాలి.