Covid Effect on employees: రాష్ట్రంలో కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోంది. గత రెండువేవ్‌లతో పోలిస్తే ఈసారి అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతూ.. సామాన్యుడిని మొదలుకొని ఫ్రంట్‌లైన్ వారియర్స్ వరకు అందరినీ చుట్టేస్తోంది. సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్‌లో పలువురు సీనియర్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, రవాణా, రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీనివాసరాజు, వైద్యారోగ్య కార్యదర్శి రిజ్వి, ఆర్ధిక శాఖ సలహాదారు విశ్రాంత ఐఏఎస్ అధికారి శివశంకర్‌కి పాజిటివ్ నిర్ధరణ అయింది. దాదాపు 30 మంది వరకు ఉద్యోగులు కొవిడ్ బారిన పడినట్లు సమాచారం. సచివాలయంలో కేసులు పెరుగుతున్నందున కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలుచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. మహమ్మారి బారినపడిన వారంతా సెలవుపై వెళ్తండటం, క్వారంటైన్ పూర్తయ్యే వరకు విధులకు వచ్చే అవకాశం లేకపోవడంతో దైనందిన కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
వైద్యారోగ్య శాఖపై తీవ్ర ప్రభావం
covid on health department: వైద్యారోగ్య శాఖపైనా కొవిడ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. వందలమంది వైద్యులు, సిబ్బంది ఇప్పటికే మహమ్మారి బారినపడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇక ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు కొవిడ్ సోకినట్లు ప్రకటించారు. స్వల్పలక్షణాలతో ఆస్పత్రిలో చేరుతున్నట్టు పేర్కొన్న ఆయన...త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తంచేశారు. ఇటీవలే హైదరాబాద్ డీహెచ్ వెంకట్ సహా పలువురు అధికారులకు కొవిడ్ నిర్ధరణ అయింది. ఉస్మానియాలో దాదాపు 180 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా సోకినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. గాంధీఆస్పత్రిలో సుమారు 80మందికొవిడ్ బారినపడ్డారు. వారిలో15 మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్లు, 16 మంది హౌజ్‌సర్జన్లు, నలుగురు సీనియర్ రెసిడెంట్లు, 22 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఐదుగురు పేషంట్ కేర్‌ప్రోవైడర్లతో పాటు ఓ అసోసియేట్ ప్రొఫెసర్ ఉన్నట్లు అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. నీలోఫర్‌లోనూ సుమారు 25 మందికి పైగా కోవిడ్ బారినపడగా ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రిలో 10మందివరకు, కింగ్‌కోఠి ఆస్పత్రిలో సుమారు ఐదుగురికి మహమ్మారి సోకింది. పేట్లబుర్లు, కోటీ మెటర్నిటీ ఆస్పత్రులతో పాటు చెస్ట్‌ఆస్పత్రిలోనూ పలువురు కరోనా బారినపడినట్లు అధికారులు ధ్రువీకరించారు. రంగారెడ్డి పరిధిలో దాదాపు 50 మంది వరకు వైద్యులు, సిబ్బందికి కోవిడ్ సోకినట్టు డీహెచ్ వెల్లడించారు. జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ముగ్గురు వైద్యులతో పాటు 13 మంది సిబ్బందికి కరోనా సోకింది.