ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గత మూడ్రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నట్లు ఆయన వివరించారు. రూర్కెలా, జామ్‌నగర్ నుంచి ఆక్సిజన్ తెప్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆక్సిజన్ సరఫరాకు తుపాను వల్ల ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు.ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు కొవిషీల్డ్ మొదడి డోసు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 45 ఏళ్లు నిండి.. ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగిన రైల్వే, ఆర్టీసీ, బ్యాంకు ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు మొదటి డోసు వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించామన్నారు. గత మూడు రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తున్నాయని, రోజుకు వెయ్యి కేసుల వరకూ తగ్గుతూ వచ్చాయన్నారు. 104 కాల్ సెంటర్ కూడా కరోనా బాధితుల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ తగ్గుముఖం పట్టాయన్నారు.
ఏపీలో కరోనా త్వరగా కంట్రోల్లోకి వచ్చే అవకాశముందన్నారు. రాబోయే రెండ్రోజుల్లో తుఫాన్ వల్ల ఇబ్బందులు ఉండొచ్చునని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు ముందుస్తుగా సమీకరించుకున్నామని సింఘాల్ తెలిపారు. రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం ప్రత్యక్షంగా పెద్దగా చూపకపోయినా, ఒడిశా నుంచి వచ్చే ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు రావొచ్చునని కేంద్ర కేబినెట్ సెక్రటరీ తెలియజేశారన్నారు. దీంతో ముందు జాగ్రత్తగా ఆక్సిజన్ నిల్వలను వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించుకున్నామన్నారు.