తెలంగాణ

telangana

ETV Bharat / state

Covid: కరోనా పాజిటివ్​ కావాలా.. నెగెటివా..? - అక్రమంగా కరోనా పాజిటివ్​ నెగెటివ్​ రిపోర్టులు

నమూనాలు తీసుకోకుండానే కోరుకున్న మేరకు కొవిడ్‌ పాజిటివ్‌, నెగెటివ్‌ రిపోర్టులు జారీ చేస్తున్న ఓ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ ఉదంతం పాతబస్తీ చాంద్రాయణగుట్టలో బయటపడింది. విశ్వసనీయ సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు శుక్రవారం సాయంత్రం ఆ కేంద్రంపై దాడిచేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

covid positive or negative report for money in hyderabad city
కరోనా పాజిటివ్ కావాలా.. నెగెటివా..?

By

Published : Jun 5, 2021, 10:11 AM IST

హైదరాబాద్​ బండ్లగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ వాహెద్‌ బాబా క్రిస్టల్‌టౌన్‌లో ఆల్‌కేర్‌ పాలిక్లినిక్‌ అండ్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. రెండు నెలల క్రితం ఓ ప్రముఖ ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకోగా.. దానికి సంబంధించిన పత్రాలు ఇంకా చేతికందలేదు. అయితే శాంపిల్స్‌ ఆ ఆసుపత్రికి పంపుతూ రిపోర్టులు పొందుతున్నాడు. ఇదే సెంటర్‌లో కొన్ని నెలలుగా కొవిడ్‌-19 పరీక్షలూ చేస్తున్నారు. అకౌంటెంట్‌గా పనిచేస్తున్న మహ్మద్‌గౌస్‌ డబ్బులు దండుకుని శాంపిల్స్‌ సేకరించకుండానే కొవిడ్‌-19 పాజిటివ్‌, నెగిటివ్‌ రిపోర్టులు జారీ చేస్తున్నాడు.

చాంద్రాయణగుట్ట ఎస్సై కె.గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో కానిస్టేబుల్‌ వై.నిఖిల్‌సాయి ఈ కేంద్రానికి వెళ్లారు. కొవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు కావాలని, ఎంతైనా డబ్బు ఇస్తానని చెప్పగా.. మహ్మద్‌గౌస్‌ రూ.1200 ఖర్చవుతుందని, రాత్రి 9 గంటలకు రిపోర్టు వాట్సాప్‌లో పంపుతానని చెప్పాడు. కాస్త త్వరగా రిపోర్టు కావాలని కానిస్టేబుల్‌ నిఖిల్‌ కోరగా, మరో రూ.800 చెల్లిస్తే ఇస్తానని చెప్పాడు. నిఖిల్‌ సమాచారం మేరకు ఎస్సై గోవర్ధన్‌రెడ్డి మహ్మద్‌గౌస్‌ను అరెస్టు చేశారు. కేంద్రం నిర్వాహకుడు మహ్మద్‌ వాహెద్‌ బాబానూ అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

ఇదివరకే ‘సేజ్‌పాత్‌’ యాప్‌ ద్వారా నకిలీ ధ్రువపత్రాలు అందజేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలో పరీక్షలు చేస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ఎంతమందికి ఈ తరహాలో తప్పుడు రిపోర్టులు ఇచ్చారన్నదానిపై దర్యాప్తు జరుగుతోంది. కేంద్రంలోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

ABOUT THE AUTHOR

...view details