నగరంలోని మోతీనగర్ వాసికి ఇటీవల పాజిటివ్ వచ్చింది. వైద్యులు కనీసం 14 రోజులు ఇంటిపట్టునే ఉండాలని సూచించినా, 8 రోజులు హోంఐసొలేషన్‌లో ఉండి, బయటకు వచ్చేశాడు. ఇది పద్ధతి కాదని కొందరు హెచ్చరించారు. పదో రోజూ పరీక్ష చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. సాధారణ జీవనంలోకి మారిపోయాడు. తరవాత పది రోజులకు రుచి, వాసన కోల్పోయాడు. మళ్లీ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. పూర్తిగా కోలుకోకుండా బయట తిరగడం వల్లేనని వైద్యులు తేల్చారు.
ఎల్బీనగర్‌లో తొలుత ఇంటి యజమానికి, రెండు రోజులయ్యాక భార్య, కుమార్తెలకు కరోనా సోకింది. తరవాత పరీక్ష చేయించుకొంటే వారిద్దరికీ నెగెటివ్ వచ్చింది. యజమానికి ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో ఆస్పత్రిలో చేర్పించారు. జాగ్రత్తలు తీసుకోకుండా ఆయనకు సేవచేయడంతో భార్య, కుమార్తె మరోసారి కరోనా బారినపడ్డారు.
ఆర్టీపీసీఆర్‌లో నెగెటివ్ వస్తేనే బయటికి రావాలి:
కొవిడ్ సోకిన వారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం 14 రోజులు ఇంటిపట్టునే ఉండి, 15వ రోజు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకుని నెగెటివ్ వచ్చాకే బయటకు రావాలి. ఈ సూచనను పలువురు ఖాతరు చేయడంలేదు. రెండు రకాల నిర్లక్ష్యాలతో మరోమారు ముప్పు కొనితెచ్చుకుంటున్నారు. కొంతమంది 8వ రోజుకే నెగెటివ్ వచ్చేసిందని ఉద్దేశంతో బయట తిరుగుతున్నారు. ఇటువంటి వారు పక్షం రోజుల్లో మళ్లీ కొవిడ్ బారిన పడుతుండడం ఆందోళన రేకెత్తిస్తోందని వైద్యులు చెబుతున్నారు. మరికొందరు 14 రోజుల తరువాత తమకు నెగెటివ్ వచ్చిందని, యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని ఇక మహమ్మారి సోకదన్న ఉద్దేశంతో జనసమూహంలో కలిసి పోతున్నారు. మాస్కులూ పెట్టుకోవడం లేదు. ఇటువంటి వారిని మళ్లీ కరోనా చుట్టేస్తోంది. ఇలాంటి వారి సంఖ్య మహానగరంలో పెరుగుతోందని, ఇది వారికి మరింత ఆందోళనకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.