‘వైద్యం కోసం ఎవరు వచ్చినా వెనక్కి పంపించొద్ధు ఓపీ చీటీ, ఇతర పత్రాలు అంటూ కాలయాపన చేయొద్ధు రోగి వచ్చిన వెంటనే వైద్యం ప్రారంభించాలి. అత్యవసర వైద్యం అందక రోగులెవరూ చనిపోకూడదు. అన్ని సౌకర్యాలూ సమకూరుస్తున్నాం.
అన్ని రకాల పడకలూ అందుబాటులో ఉన్నాయి. అందరూ బాధ్యతాయుతంగా పనిచేసి బాధితుల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందించాలి. ఇదీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు.. కానీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. కరోనా సోకిన వారికి అత్యవసర వైద్యం అందని ద్రాక్షలానే మారింది.
చికిత్స కోసం వస్తున్న రోగులకు పడకలు అందుబాటులో లేవని వెనక్కి పంపించేస్తున్నారు. ఒకవేళ ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే అక్కడా చేర్చుకోవడం లేదు. రాత్రి సమయాల్లో వచ్చే బాధితుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అత్యవసర చికిత్స అందక కొందరు మృత్యువాత పడుతున్నారు.
అనంతపురం జిల్లాలో.. అధికారులు చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. కొవిడ్ ఆసుపత్రుల్లో అన్ని వసతులు కల్పించాం.. బాధితులకు తక్షణ వైద్యం అందిస్తున్నామంటూ ప్రకటనలు చేస్తున్నారే తప్ఫ. వాస్తవ పరిస్థితులు గ్రహించడం లేదు.
అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదు. మంచాలు ఖాళీ లేవంటూ వెనక్కి పంపించేస్తున్నారు. ఫలితంగా పలువురు మృత్యువాత పడిన ఘటనలు జిల్లాలో చోటుచేసుకున్నాయి. కొవిడ్ బాధితులకు వైద్యం అందించడానికి జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రి, హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి, గుంతకల్లు, కదిరి ప్రాంతీయ ఆసుపత్రులు, మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ఎంపిక చేశారు.
వీటిలో సర్వజన ఆసుపత్రి, హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బత్తలపల్లి ఆర్డీటీ, కిమ్స్-సవీరా ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్స అందిస్తున్నారు. మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను కొవిడ్ కేంద్రాలుగా ఎంపిక చేసినా.. వాటిలో బాధితులను చేర్చుకున్న దాఖలాలు లేవు.
జిల్లా కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన ఓ వ్యక్తికి రెండు రోజుల కిందట పాజిటివ్ వచ్చింది. అంబులెన్సు రాకపోవడంతో మంగళవారం స్వయంగా ట్రయేజింగ్ సెంటర్‌కి వెళ్లారు. బత్తలపల్లి ఆర్డీటీకి వెళ్లాలని వైద్యులు సూచించారు. ఆర్డీటీ దగ్గర నాలుగైదు గంటలు వేచిచూసినా పడకలు ఖాళీ లేకపోవడంతో వెనుదిరిగి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
కళ్యాణదుర్గానికి చెందిన ఓ వృద్ధుడికి సోమవారం మధ్యాహ్నం నుంచి ఆయాసం ఎక్కువ కావడంతో సర్వజనాసుపత్రికి వచ్చారు. రెండు గంటలు గడిచినా పడకలు లేవంటూ చేర్చుకోలేదు. ఆఖరికి ఆ వృద్ధునితో వచ్చిన సహాయకుడు ఉన్నతాధికారులకు విన్నవించుకోగా పడక దొరికింది. ఆ వృద్ధుడు అర్ధరాత్రి దాటాక మృతి చెందారు.
ప్రకటనలతోనే సరి