తెలంగాణ

telangana

ETV Bharat / state

వచ్చే ఏడాదీ ‘ఉన్నత’ విద్య అస్తవ్యస్తమే! - telangana varthalu

కరోనా మహమ్మారి పలు రంగాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొవిడ్​ దెబ్బకు ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలు, ప్రవేశాల ప్రక్రియ, తరగతుల ప్రారంభం అయోమయంలో పడనుంది. కరోనా తీవ్రత తగ్గే వరకు ప్రవేశ పరీక్షలు జరిపే పరిస్థితి లేకపోవడంతో విద్యా సంవత్సరం ప్రారంభం ఎప్పుడన్న సందిగ్ధత నెలకొంది.

covid effect on higher education
వచ్చే ఏడాదీ ‘ఉన్నత’ విద్య అస్తవ్యస్తమే!

By

Published : May 6, 2021, 6:49 PM IST

కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరమూ అస్తవ్యస్తంగా మారనుంది. ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలు, ప్రవేశాల ప్రక్రియ, తరగతుల ప్రారంభం అయోమయంలో పడనుంది. కరోనా తీవ్రత తగ్గే వరకు ప్రవేశ పరీక్షలు జరిపే పరిస్థితి లేకపోవడంతో విద్యా సంవత్సరం ప్రారంభం ఎప్పుడన్న సందిగ్ధత నెలకొంది. జేఈఈ మెయిన్‌ రెండు విడతల పరీక్షలను వాయిదా వేయడంతో 2021-22 విద్యా సంవత్సరం ఆలస్యం అవుతుందని ఐఐటీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గితే వెంటనే పాఠశాలలు తెరిచి తరగతులు నిర్వహించవచ్చు. ఉన్నత విద్యలో అలా కుదరదు. ప్రవేశ పరీక్షలు నిర్వహించాలి. ఫలితాలు ఇవ్వాలి. ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ జరపాలి. ఆ తర్వాత తరగతులు మొదలవుతాయి. దానికితోడు జాతీయ విద్యా సంస్థల కౌన్సెలింగ్‌ ముగియకుండా ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌ సీట్లను రాష్ట్ర స్థాయిలో భర్తీ చేయలేరు.
మెయిన్‌ ...అడ్వాన్సుడ్‌ జరిపేది ఎన్నడు?
జేఈఈ మెయిన్‌ను నాలుగు సార్లు జరపాల్సి ఉండగా రెండు విడతలు పూర్తయ్యాయి. ఈలోపు కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలుకావడంతో ఏప్రిల్‌, మే నెలల్లో జరగాల్సిన పరీక్షలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. మెయిన్‌ రెండు పరీక్షలు జులై వరకు జరిగే పరిస్థితులు అసలే కనిపించడం లేదు. ఈ రెండు పరీక్షలు జరిపిన తర్వాత...ఫలితాలు ఇవ్వాలి. మళ్లీ అడ్వాన్సుడ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష జరిపి ఫలితాలు ఇవ్వాలి. మళ్లీ కనీసం 20 రోజులపాటు కౌన్సెలింగ్‌ జరపాలి. ఇదంతా చూస్తుంటే నవంబరు ముగుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది నవంబరు 2వ వారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు మొదలవ్వగా ఈసారి డిసెంబరు వరకు పోవచ్చని ఐఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా ఐఐటీల్లో జులై మూడో వారంలో, రాష్ట్రాల్లో ఆగస్టు మొదటి వారంలో బీటెక్‌ తరగతులు మొదలవుతాయి.గత ఏడాది ఐఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులు ఇప్పుడు 2వ సెమిస్టర్‌ చదువుతున్నారు. మరో నెలలో అది పూర్తవుతుంది. ఆ తర్వాత 20 రోజులు సెలవులు ఇచ్చి బీటెక్‌ 2వ సంవత్సరం మొదటి సెమిస్టర్‌(3వ) మొదలుపెడతారు. అది 2021 డిసెంబరుకు పూర్తవుతుంది. అప్పటి వరకు విద్యార్థులు ఐఐటీలను చూసే పరిస్థితి లేదు.
ఇప్పటికే ఏప్రిల్‌లో జరగాల్సిన నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షను నాలుగు నెలలపాటు వాయిదా వేశారు. ఇక నీట్‌ యూజీ(ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి)ని ఆగస్టు 1న జరుపుతామని రెండు నెలల క్రితమే ప్రకటించినా ఇప్పటివరకు దరఖాస్తుల ప్రక్రియను మొదలుపెట్టలేదు. అంటే ఆగస్టు 1న జరుగుతుందా? లేదా? అన్నదానిపై దేశవ్యాప్తంగా 16 లక్షల మందిలో ఉత్కంఠ నెలకొంది.

గత ఏడాది కంటే ఆలస్యం కావొచ్చు

జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌, మే నెలల పరీక్షలు జరగాల్సి ఉండటం, మళ్లీ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, ఫలితాలు, కౌన్సెలింగ్‌ వల్ల గత ఏడాది కంటే ఇంకొంత ఆలస్యం అవుతుంది. కరోనా పరిస్థితుల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడు ముందుగా ఏదీ చెప్పలేని పరిస్థితి. -ఆచార్య రాంగోపాల్‌రావు, సంచాలకుడు, ఐఐటీ దిల్లీ

ఎప్పుడెప్పుడు వెళదామా అని ఎదురు చూస్తున్నా..

గత ఏడాది జేఈఈ అడ్వాన్సుడ్‌లో 2వ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో ప్రవేశం పొందా. ప్రస్తుతం రెండో సెమిస్టర్‌ చదువుతున్నా. మరో నెలలో అది పూర్తవుతుంది. గత ఏడాది నవంబరు నుంచి ఆన్‌లైన్‌లోనే చదువుకుంటున్నా. ఐఐటీకి ఎప్పుడెప్పుడు వెళదామా అని ఎదురు చూస్తున్నా. -భువన్‌రెడ్డి, 2వ ర్యాంకర్‌, 2020 జేఈఈ అడ్వాన్సుడ్‌

చర్చించలేం...ఆసక్తి ఉండటం లేదు

గత ఏడాది జేఈఈ అడ్వాన్సుడ్‌ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో బీటెక్‌ సీఎస్‌ఈలో చేరా. విజయనగరం జిల్లా గుర్ల మండలం గరివిడి గ్రామంలో ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నా. రోజుకు 4-5 గంటలపాటు ఆన్‌లైన్‌ తరగతులు ఉంటున్నాయి. చర్చలు లేకపోవడం వల్ల పాఠాలు ఆసక్తిగా అనిపించడం లేదు. ఇప్పటివరకు తరగతి గది బోధన ఎప్పుడు ఉండేదో ఐఐటీలు మాకు చెప్పలేదు. -జితేందర్‌, 14వ ర్యాంకర్‌, 2020 జేఈఈ అడ్వాన్సుడ్‌

ఇదీ చదవండి:ఒక్కరాత్రిలో 200 మంది ప్రాణాలు కాపాడిన కరోనా యోధులు

ABOUT THE AUTHOR

...view details