ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించాల్సిన టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ సెట్-2021(TSWRJC CET-2021)... కరోనా నేపథ్యంలో రద్దయింది. పదో తరగతిలో సాధించిన గ్రేడు, సీజీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. గురుకులాల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 7వ తేదీలోపు సబ్జెక్టుల వారీగా మార్కులు, సీజీపీఏ వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(Center Of excellence)లో ప్రవేశానికి ఇప్పటికే తొలిదశ పరీక్ష జరిగింది. మేలో రెండోదశ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే.. ఇప్పట్లో రెండో దశ పరీక్షను నిర్వహించడం సాధ్యం కాదని, తొలిదశ పరీక్ష మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని సొసైటీ నిర్ణయించింది.
ఐదో తరగతి ప్రవేశాలపై..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం లక్ష మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. 2020-21 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం గత నవంబరులో పరీక్ష నిర్వహించి, ప్రవేశ ప్రక్రియను ముగించేలోపే రెండో దశ కరోనా మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రవేశ పరీక్ష నిర్వహించాలా? వద్దా? ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలా? అని సొసైటీలు తర్జనభర్జన పడుతున్నాయి. మైనార్టీ సొసైటీ తరహాలో లాటరీ పద్ధతి(Lottery Method)లో ఐదో తరగతి ప్రవేశాలను నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నాయి.