తెలంగాణ

telangana

ETV Bharat / state

Covid Effect: పండుటాకులపై పెరిగిన వేధింపులు... తప్పని ఛీత్కారాలు - తెలంగాణ వార్తలు

కరోనా వేళ ప్రతి అంశం వృద్ధులపై ప్రతికూల ప్రభావాలను చూపించింది. కాస్త ప్రేమకి కూడా నోచుకోవడం కాదుకదా... కుటుంబ సభ్యుల నుంచి ఛీత్కారాలు రావడంతో వారు అల్లాడిపోతున్నారు. తమ నుంచి వైరస్ సోకుంతుందమో అనే భయంతో కొందరు దూరంగా ఒంటరిగా జీవిస్తున్నారు. హెల్పేజ్​ ఇండియా నిర్వహించిన సర్వేలో మరిన్ని అంశాలు వెలువడ్డాయి.

covid-effect-on-elders
Covid Effect: పండుటాకులపై పెరిగిన వేధింపులు... తప్పని ఛీత్కారాలు

By

Published : Jun 15, 2021, 7:05 AM IST

కరోనా మహమ్మారి కాలంలో దేశవ్యాప్తంగా వృద్ధులపై వేధింపులు ఎక్కువయ్యాయని ‘హెల్పేజ్‌ ఇండియా’ సర్వేలో వెల్లడైంది. అసహ్యించుకోవడం, తిట్లు, భౌతిక దాడులను 15.6 శాతం మంది వృద్ధులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోనే కాదు.. వృద్ధాశ్రమాల్లో ఉంటున్నవారికీ వేధింపులు తప్పడం లేదు. లాక్‌డౌన్‌తో ఆత్మీయులతో సంబంధాలు, బంధుత్వాలు దూరమయ్యాయని సర్వేలో పాల్గొన్న వృద్ధులు అభిప్రాయపడ్డారు.

అందుబాటులో లేకపోవడం, స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం లేక టీకా వేయించుకోలేదని 54.3 శాతం మంది హైదరాబాద్‌లోని వృద్ధులు తెలిపారు. మంగళవారం ‘ప్రపంచ వయోవృద్ధులపై వేధింపుల కట్టడి రోజు’గా పాటిస్తున్న సందర్భంగా ‘హెల్పేజ్‌ ఇండియా’ సర్వే చేసి రూపొందించిన ‘నిశబ్ద హింస - కరోనా, వృద్ధులు’ నివేదికను ఆ సంస్థ రాష్ట్ర ప్రతినిధి మహ్మద్‌ రజాతో కలిసి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య సోమవారం విడుదల చేశారు.

సర్వేలో వెల్లడైన ముఖ్యాంశాలు..

  • దేశవ్యాప్తంగా పదిశాతం మంది వృద్ధులు కుటుంబసభ్యులకు దూరంగా ఒంటరిగా జీవిస్తున్నారు. కరోనా కాలంలో రోజూ వంట చేసుకోవడం, సరకులు, మందులు తెచ్చుకోవడం, దుస్తులు ఉతకడం కష్టమవుతోంది. వీరిలో పలువురు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు. 9 శాతం మంది కుటుంబసభ్యులకు దూరంగా బతుకుతున్నారు.
  • తమ కారణంగా కుటుంబ సభ్యులు కరోనా బారిన పడుతారన్న ఆందోళన 29 శాతం మందిలో వ్యక్తమైంది.
  • దేశవ్యాప్తంగా 5.8 శాతం మందికి ఎలాంటి ఆదాయం లేదు. కరోనాతో కుటుంబసభ్యుల ఆదాయం తగ్గిపోవడం, వేతన కోతలు, వ్యాపారం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
  • ఇళ్లలో వృద్ధుల సంరక్షణ బాధ్యతలు చూస్తున్న యువతలో 32.2 శాతం మందికి ఉపాధి, ఉద్యోగాల్లేవు. వీరిలోనూ మహిళలు ఎక్కువ. హైదరాబాద్‌లో 31.3 శాతం మంది సంపాదించే కుటుంబ సభ్యులం కాదని చెప్పారు. వేతన కోతలతో కుటుంబ ఆదాయం తగ్గిందని 66.3 శాతం మంది చెప్పారు.
  • మహమ్మారి సమయంలో వృద్ధాశ్రమాల్లోనూ వైద్య ఆరోగ్య సేవల నాణ్యత తక్కువగా ఉంది. ప్రతి పది మందిలో ఒకరికి వైద్యసేవలు సకాలంలో అందడం లేదని వెల్లడైంది.

మరో సంస్థ ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌ కూడా నివేదికను విడుదల చేసింది.. అందులోని ముఖ్యాంశాలు..

  • ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌ 5 వేల మంది వృద్ధులను సర్వే చేయగా, 82 శాతం మంది కరోనాతో తమ జీవితాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు చెప్పారు. 73 శాతం మంది లాక్‌డౌన్‌ సమయంలోనూ, ఆ తర్వాతా తమపై వేధింపులు పెరిగినట్లు తెలిపారు.
  • 65 శాతం మంది తమ పట్ల కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చూపుతున్నట్లు చెప్పగా, 58 శాతం మంది ఇళ్లలోనూ, సమాజంలోనూ హింసకు గురవుతున్నట్లు తెలిపారు.
  • సుమారుగా ప్రతి ముగ్గురు వృద్ధులలో ఒకరు(35 శాతం) సొంత ఇళ్లలోనే శారీరక లేదా మానసిక హింసను ఎదుర్కొంటున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:'రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గించాలి'

ABOUT THE AUTHOR

...view details