తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్‌ ఔషధాలకు మార్కెట్లో కొరత.. 2 నెలల్లో వినియోగం రెట్టింపు

రాష్ట్రంలో కొవిడ్‌ మందులకు కటకట ఏర్పడింది. ఇప్పటికే వైరస్‌ సోకిన తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో వినియోగించే రెమ్‌డెసివిర్‌.. టోసిలిజుమాబ్‌ ఇంజక్షన్లకు తీవ్ర కొరత ఏర్పడగా.. తాజాగా వైరస్‌ సోకిన తొలినాళ్లలో వాడే అతి ముఖ్యమైన ఔషధాలూ చాలాచోట్ల దొరకట్లేదు. కార్టికో స్టెరాయిడ్స్‌, యాంటీబయాటిక్స్‌, విటమిన్‌ మాత్రలు, ఇంజక్షన్లు బహిరంగ విపణిలో తగినంతగా లభ్యం కావడం లేదు.

covid-drugs-shortage-in-telangana
కొవిడ్‌ ఔషధాలకు మార్కెట్లో కొరత.. 2 నెలల్లో వినియోగం రెట్టింపు

By

Published : May 7, 2021, 6:47 AM IST

హైదరాబాద్‌ చింతల్‌బస్తీకి చెందిన ఓ మహిళ కొవిడ్‌ బారినపడ్డారు. వైద్యుని సూచనల మేరకు ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారు. మందుల కోసం కుటుంబ సభ్యులు సమీపంలోని అన్ని ఔషధ దుకాణాలు తిరిగారు. దాదాపు అన్నిచోట్లా జింకు, విటమిన్‌ సి మాత్రలు లేవనేశారు. అజిథ్రోమైసిన్‌కూ అదే పరిస్థితి. చివరకు వైద్యుని సూచనల మేరకు సెఫిక్సిమ్‌ కొనాల్సి వచ్చింది.

గత రెండు నెల్లలో కొవిడ్‌ విజృంభణ తీవ్రస్థాయికి చేరుకోగా ఇదే సమయంలో ఔషధ వినియోగం కూడా రెట్టింపైంది. కొవిడ్‌ వచ్చిన తొలి రోజుల్లో వినియోగిస్తున్న యాంటీ వైరల్‌ ఔషధం.. ఫావిపిరావిర్‌ కాగా ఈ మాత్రలను ప్రధానంగా ఐదారు పేరున్న సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. కొందరు వైద్యులు మాత్రం ఒకే కంపెనీకి చెందిన మాత్రలను సూచిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. నిజానికి అన్ని మాత్రలు ఒకే విధంగా పనిచేస్తాయి. ఒకే రకమైన ఫలితం కూడా లభిస్తుంది.

ఒక్కసారిగా డిమాండ్..

ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందే వారి కంటే ఇళ్లలో ఉంటూ చికిత్స పొందేవారు 70 శాతానికి పైగా ఉంటున్నారు. యూట్యూబ్‌ల్లో, వాట్సప్‌ గ్రూపుల్లో ఎక్కడబడితే అక్కడ, ఎవరు పడితే వారు కొవిడ్‌ చికిత్సకు సంబంధించిన ఔషధాలను సూచిస్తున్నారు. మొదటి వారంలో ఏ మందులు వాడాలో.. జ్వరం తగ్గకపోతే రెండోవారంలో ఏ మందులు వాడాలో కూడా చెబుతున్నారు. ఇందులో స్టెరాయిడ్‌ల ప్రాధాన్యం గురించి కూడా ఎక్కువ ప్రచారం జరగడంతో డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. పైగా ఈ మందులేమీ బాగా ఖరీదైనవి కూడా కావు. డెక్సామెథజోన్‌ ఔషధమైతే 0.5 మి.గ్రా.లతో కూడిన 10 మాత్రలు రూ.3 లోపే. వీటిని కొందరికి రోజుకు 3 మిల్లీ గ్రాములు... మరికొందరికి 4 మిల్లీ గ్రాముల చొప్పున సుమారు 10 రోజుల వరకూ సూచిస్తుంటారు. కానీ ఇవి కూడా సరిగా అందుబాటులో లేవు. ఇదే విధంగా ప్రజల వినియోగానికి తగినట్లుగా ఉత్పత్తి జరగకపోతే మున్ముందు పారాసెటమాల్‌కు కూడా కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రెండు నెలల్లో ఒక్కసారిగా కొవిడ్‌ ఔషధాలకు డిమాండ్‌ పెరిగిపోవడమనేది ఔషధ సంస్థలు కూడా ఊహించలేదు. మార్చి వరకూ మహమ్మారి అదుపులోనే ఉండడం, కేసుల సంఖ్య 500 లోపే నమోదవుతుండడంతో.. అవి కూడా ఉత్పత్తిని పెంచడంపై దృష్టిపెట్టలేదు. ఇంత డిమాండ్‌ను అంచనా వేయలేకపోయాయి.


ఉత్పత్తి పెంచాలి

కొవిడ్‌ చికిత్సలో వినియోగించే కొన్ని ఔషధాలకు కొరత ఏర్పడింది. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను బహిరంగ విపణిలో అందుబాటులోకి తేవాలి. ఔషధ ఉత్పత్తికి హైదరాబాద్‌ ప్రపంచంలోనే కేంద్ర బిందువు. మన అవసరాలకు తగ్గట్లుగా ఉత్పత్తిని పెంచేలా ఆదేశాలివ్వడం ద్వారా విపణిలో కొరత తీరే అవకాశం ఉంది.

- అరుగొండ శ్రీధర్‌, అధ్యక్షుడు, ఔషధ దుకాణదారుల సంఘం, జీహెచ్‌ఎంసీ

ప్యాకెట్‌ చింపి చూస్తే రంగు మారి.. ముద్దగా మాత్ర

కొన్ని సంస్థలు అత్యవసరంగా ఔషధ నియంత్రణ సంస్థ వద్ద అనుమతులు పొంది, తమ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇది కఠిన సమయం కావడంతో ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు కూడా అనుమతులు ఇచ్చేస్తున్నారు. కొన్ని సంస్థలు అప్పటికే బాగా పేరొందిన ఒక ఉత్పత్తి పేరుకు దగ్గరగా ఉండేలా.. పలికినా కూడా అదే రీతిలో ధ్వనించేలా.. ఒక అక్షరాన్ని అటూ ఇటూగా మార్చుతున్నాయి. వినియోగదారులు తెలియకో మరో గత్యంతరం లేకో వాటిని కొంటున్నారు. ముఖ్యంగా జింకు, విటమిన్‌ మాత్రల్లో ఈ తరహా విధానాన్ని ఎక్కువగా అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఒక జింకు మాత్రల ప్యాకెట్‌ను చింపి చూస్తే.. అందులో మాత్ర రంగు మారి, ముద్దగా కనిపించినట్లుగా ఒక ఔషధ దుకాణదారు తెలిపారు. ఇటువంటివి వాడడం వల్ల అవి గుణమివ్వకపోగా.. జబ్బు తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. ‘‘రాష్ట్రంలో ఔషధ నియంత్రణాధికారులు ఉత్పత్తి సంస్థల్లోనే తనిఖీలు నిర్వహించి, మందుల నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించాలి. ఎప్పటికప్పుడూ పరీక్షలు నిర్వహించకపోతే.. నాణ్యత ప్రమాణాలు మరింతగా దిగజారే ప్రమాదముంది’’ అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:'ఆక్స్​ఫర్డ్ టీకాతో రక్తం గడ్డకట్టే రేటులో పెరుగుదల'

ABOUT THE AUTHOR

...view details