Covid Cases Increases In Telangana : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. కేసుల్లో క్రమంగా పెరుగుదల కన్సిస్తోంది. గత నాలుగు రోజులుగా వీటి సంఖ్య అంతకంతకూ అధికమవుంతోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ కేసులు పెరగటం ఆందోళన కలిస్తోంది. ఈ ఏడాది జనవరి 27న రాష్ట్రంలో సున్నా కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ బాధ తప్పిందని అందరూ హర్షం వ్యక్తం చేశారు.
కానీ ఈ ఇటీవల వారం రోజుల నుంచి కేసుల సంఖ్య ఎక్కువ అవుతోంది. దాదాపు 50 శాతానికి పైగా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతుండటంతో నగర వాసులు భయపడుతున్నారు. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,254 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే.. అందులో 52 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 148 మంది ఫలితాలు రావాల్సి ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇక ఈ నెల 1 వ తేదీన రాష్ట్రంలో 4,405 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా... అందులో 21 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో 267 మంది కొవిడ్ బాధితులు ఉన్నారు. వీరి సంఖ్య ఈ నెల మొదటి తేదీ నాటికి 93 మాత్రమే కావటం గమనార్హం. గడచిన అయిదు రోజుల్లో కేసుల్లో పెరుగుదల నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
జిల్లాల్లోనూ వైరస్ వ్యాపి పెరుగుతున్నట్లు అధికారిక నివేదికలు తెలుపుతున్నాయి. సరిగ్గా రెండు వారాల క్రితం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ సహా మొత్తం అయిదు జిల్లాల్లో మాత్రమే కేసులు పరిమితం అయ్యాయి. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో ఒకటి, రెండు కేసులు మాత్రమే వెలుగు చూసిన పరిస్థితి.