Covid cases increasing in Telangana day by day: రాష్ట్రంలో కరోనా మరోమారు పంజా విసురుతోంది. దాదాపు 2శాతం పాజిటివిటీ రేటుతో నిత్యం 50 వరకు కేసులు నమోదవుతున్నాయి. కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా చాపకింద నీరులా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టించిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. 2020లో ప్రారంభమైన కొవిడ్ రూపాంతరం చెందుతూ మూడు వేవ్‌లుగా వణికించింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ జనవరిలో సున్నా కేసులు నమోదవ్వటంతో వైరస్ వ్యాప్తి ముగిసినట్లే భావించారు. ఇటీవల రోజుకి పది చొప్పున మొదలై యాభై మంది మహమ్మారి బారిన పడుతున్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి విదేశాలకు వెళ్లేవారు, వైద్య అవసరాల మినహా టెస్టులు చేయించుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో వెలుగు చూస్తున్న కేసుల కంటే టెస్టులు చేయించుకోని వారి సంఖ్య అధికంగా ఉంటుందన్న అంచనాలున్నాయి. దీనిపై కూడా అధికారులు దృష్టిసారించారు. ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు.