హైదరాబాద్‌లో 54 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు: సీసీఎంబీ - telangana varthalu
16:21 March 04
హైదరాబాద్‌లో 54 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు: సీసీఎంబీ
హైదరాబాద్ నగరంలోని సుమారు 54శాతం మందిలో కరోనా వైరస్‌కి సంబంధించిన యాంటీబాడీలు ఉన్నట్టు సీసీఎంబీ, ఎన్ఐఎన్ సంస్థలు ప్రకటించాయి. నగరంలో ఈ ఏడాది జనవరి నుంచి సీసీఎంబీ, ఎన్ఐఎన్, భారత్ బయోటెక్ సంస్థ సంయుక్తంగా సీరో సర్వేని నిర్వహించాయి. ఈ మేరకు సీసీఎంబీ ఐ హబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ కే మిశ్రా, ఎన్ఐఎన్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ లక్ష్మయ్య, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్ పాల్గొన్నారు. నగరంలోని మొత్తం 30 వార్డుల్లో 9వేల మంది నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షించిన సీసీఎంబీ ఈ మేరకు నిర్ధారించింది. ఒక్కో వార్డులో సుమారు 300 మంది నుంచి రక్త నమూనాలను సేకరించిన ఎన్ఐఎన్ ఆ శాంపిళ్లను సీసీఎంబీ సహాకారంతో విశ్లేషించింది. ఈ సర్వేలో 10ఏళ్లు మొదలుకొని 90ఏళ్ల వారు భాగస్వాములు అయ్యారు.
జనవరి మొదటి వారం నుంచి రెండు దఫాలుగా చేసిన సర్వేలో ఎన్ఐఎన్కి సంబంధించిన 75మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇక ఈ సర్వే ప్రకారం యాంటీబాడీలు ఉన్న వారిలో సుమారు 75శాతం మందికి తమకు కరోనా వచ్చిన విషయం కూడా తెలియకపోవటం గమనార్హం. గతంలో ఒకసారి నగరంలో ఇలాంటి సర్వే చేసిన ఎన్ఐఎన్ గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ మందిలో యాంటీబాడీలు ఉన్న విషయాన్ని గుర్తించినట్టు తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో స్త్రీలలో 56శాతం, పురుషుల్లో 53, వృద్ధుల్లో కేవలం 49శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు గుర్తించారు. ఇక ఈ సర్వే ప్రకారం ఇప్పటికే సుమారు 54శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందగా... ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్‌తో త్వరలో హార్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైన గవర్నర్ తమిళిసై