తెలంగాణలో కరోనా వైరస్ (కొవిడ్ 19) కేసులు వెయ్యి దాటాయి. గత నెల 2న తొలి కేసు నమోదుకాగా.. 56 రోజుల తర్వాత ఆదివారం కొత్తగా 11 మందికి వైరస్ నిర్ధారణ అవడంతో మొత్తంగా బాధితుల సంఖ్య 1001కి చేరుకుంది.
మరోవైపు గతవారం ఉద్ధృతంగా నమోదైన కేసుల సంఖ్య.. ఈ వారంలో క్రమేణా తగ్గుముఖం పడుతుండడం ఊరటనిచ్చే అంశం. కొత్తగా నమోదైన కేసులన్నీ హైదరాబాద్(జీహెచ్‌ఎంసీ) పరిధిలోనివే.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికం(540) జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే. ఆదివారం మరో 9 మంది కొవిడ్ బారి నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి ఇళ్లకెళ్లగా.. వీరిలో 75 సంవత్సరాల వృద్ధుడు కూడా ఉండడం విశేషం.
ఇప్పటి వరకూ డిశ్ఛార్జి అయినవారిలో ఇంత పెద్దవయసు వ్యక్తి ఈయనే. గాంధీ ఆసుపత్రి వైద్యుల విశేష కృషి ఫలితంగా ఇది సాధ్యమైందని వైద్యవర్గాలు తెలిపాయి.
ఏడు జిల్లాల నుంచి..
మొత్తం డిశ్ఛార్జీలను పరిగణనలోకి తీసుకుంటే.. ఏడు జిల్లాల నుంచి పది, అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో హైదరాబాద్ నుంచి అత్యధికంగా 151 మంది ఉండగా.. నిజామాబాద్‌లో 27 మంది, రంగారెడ్డిలో 10 మంది, వరంగల్ నగర జిల్లాలో 22 మంది, నిర్మల్‌లో 11 మంది, కరీంనగర్‌లో 15, నల్గొండలో 11 మంది చొప్పున ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయి ఆరోగ్యవంతులుగా ఇళ్లకు వెళ్లారు.
మరోవైపు చికిత్స పొందుతున్నవారిలో హైదరాబాద్(371), సూర్యాపేట(79), నిజామాబాద్(34), వికారాబాద్(30), గద్వాల(35), రంగారెడ్డి(21) జిల్లాల నుంచి ఎక్కువగా ఉన్నారు. వైరస్ బారినపడకుండా ప్రజలందరూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యక్తిగత దూరం పాటించాలనీ, మాస్కులు తప్పకుండా ధరించాలని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఇదీ చూడండి:వలస కూలీల సమస్యలను తీర్చిన రాచకొండ సీపీ