covaxin vaccine in US : భారత్ బయోటెక్‌కు చెందిన కొవిడ్-19 టీకా ‘కొవాగ్జిన్’పై అమెరికాలో నిర్వహించిన రెండు, మూడు దశల (ఫేజ్-2/ 3) క్లినికల్ పరీక్షల్లో సానుకూల ఫలితాలు కనిపించాయి. ఈ పరీక్షల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించినట్లు యూఎస్‌కు చెందిన ఆక్యుజెన్ ఇంక్ ప్రకటించింది. యూఎస్‌లో కొవాగ్జిన్ టీకాను విడుదల చేయటానికి ఆక్యుజెన్ ఇంక్, భారత్ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే.
Clinical Tests on covaxin vaccine in US : ‘కొవాగ్జిన్’ టీకాకు అనుమతి కోసం అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డిఏ) వద్ద ఆక్యుజెన్ ఇంక్ దరఖాస్తు చేసింది. ఇందులో భాగంగా క్లినికల్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో యూఎస్‌లోని 419 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. వారికి 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల ‘కొవాగ్జిన్’ టీకా ఇచ్చి ఫలితాలు విశ్లేషించారు. ఎంతో అధిక రోగ నిరోధక శక్తిని టీకా ప్రదర్శించినట్లు, వైరస్‌లోని ముఖ్య యాంటిజెన్లు అయిన ఎస్-ప్రొటీన్, ఆర్‌బీడీ, ఎన్-ప్రొటీన్ లక్ష్యంగా చేసుకొని పనిచేసినట్లు ఆక్యుజెన్ ఇంక్ పేర్కొంది.
ప్రస్తుతం యూఎస్‌లో అందుబాటులోని టీకాలు కేవలం ఎస్-ప్రొటీన్ యాంటీజెన్‌పై మాత్రమే ప్రభావం చూపుతున్నట్లు తెలిపింది. ఇతర ఇన్-యాక్టివేటెడ్ టీకాలతో పోల్చితే, ‘కొవాగ్జిన్’ టీకాలోని టీఎల్‌ఆర్7/8 అగోనిస్ట్ అనే అడ్జువాంట్, టీహెచ్1- బయాస్డ్ ఇమ్యూన్ రెస్పాన్స్‌ను ప్రదర్శించినట్లు, దీనివల్ల దీర్ఘకాలిక మెమొరీ బి, టీ-సెల్ రెస్పాన్స్ ఉంటాయని వివరించింది.
ఇది కీలక మైలురాయి..ఫేజ్-2/ 3 పరీక్షల్లో కొవాగ్జిన్ సానుకూలమైన ఫలితాలు సాధించినందున కొవిడ్‌ను ఎదుర్కొనటంలో కీలక మైలురాయిని చేరుకున్నట్లు అవుతోందని ఆక్యుజెన్ ఇంక్ ఛైర్మన్-సీఈఓ డాక్టర్ శంకర్ ముసునూరి పేర్కొన్నారు. క్లినికల్ పరీక్షల్లో వ్యతిరేక ఫలితాలు కనిపించలేదన్నారు. ప్రస్తుతం కొవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో, దీని నుంచి ప్రజలను రక్షించటానికి భిన్న టీకాలు అవసరమనే విషయం స్పష్టమవుతోందని న్యూ ఇంగ్లండ్ కాంప్లెక్స్ సిస్టమ్స్ ఇనిస్టిట్యూట్ లోని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ డాక్టర్ ఎరిక్ ఫీగల్ డింగ్ పేర్కొన్నారు. క్లినికల్ పరీక్షల్లో లభించిన సానుకూలమైన ఫలితాలతో ‘కొవాగ్జిన్’ టీకాను యూఎస్‌లో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలను ఆక్యుజెన్ ఇంక్ వేగవంతం చేయనుందని తెలుస్తోంది.