తెలంగాణ

telangana

By

Published : Jul 21, 2021, 3:46 PM IST

ETV Bharat / state

ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు

మాజీ ఐపీఎస్​ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని కరీంనగర్​ మున్సిఫ్ కోర్టు ఆదేశించింది. హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ ప్రవీణ్​పై న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

RS Praveen
ఆర్.ఎస్.ప్రవీణ్

మాజీ ఐపీఎస్​ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ మూడో పట్టణ పోలీసులకు మున్సిఫ్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ ప్రవీణ్​పై న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో మహేందర్​ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన మున్సిఫ్ కోర్టు జడ్జి.. ఆర్​.ఎస్.ప్రవీణ్ కుమార్​​పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది మార్చిలో పెద్దపల్లి జిల్లా జూలపెల్లి మండలం ధూళికట్టలో స్వేరోస్ భీమ్ దీక్ష కార్యక్రమంలో ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంలో వివాదాస్పద ప్రతిజ్ఞ చేయించారని కోర్టుకు తెలిపారు.

వీఆర్‌ఎస్‌ తీసుకున్న ప్రవీణ్​ కుమార్

ఆర్​.ఎస్.ప్రవీణ్​ కుమార్​ మంగళవారమే స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్‌)తీసుకున్నారు. ఆయన స్థానంలో ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్‌ను గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌లో జన్మించిన ప్రవీణ్‌ కుమార్‌ 17 సంవత్సరాల పాటు పోలీసు శాఖలో పనిచేశారు.

ముఖ్యంగా వామపక్ష తీవ్రవాదం ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. కరీంనగర్‌లో ఉన్నప్పుడు ఒకేసారి 45 మంది జనశక్తి నక్సలైట్లు లొంగిపోయారు. దాంతో ఆ సంస్థ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వామపక్ష తీవ్రవాదం వైపు మొగ్గు చూపకుండా ఉండేలా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం కొన్నాళ్లు అమెరికా వెళ్లారు. అక్కడి నుంచి రాగానే తానే ప్రభుత్వాన్ని అడిగి గురుకులాల బాధ్యత తీసుకున్నారు. చిన్నపుడు ఎస్సీ హాస్టల్లో ఉండి చదువుకున్న ఆయన అవే పాఠశాలల సొసైటీకి తొమ్మిదేళ్లపాటు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.

ఇదీ చదవండి:Cyber Fraud: డేటింగ్​ పేరుతో వలపు వల.. 77 ఏళ్ల వృద్ధునికి 11 లక్షలు టోకరా

ABOUT THE AUTHOR

...view details