ప్రభుత్వం ఇక పత్తి కొనుగోలు చేయదా? పత్తి పంటకు మద్దతు ధర అమలులో కొత్త విధానం తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కేంద్రం తరఫున ‘భారత పత్తి సంస్థ’ (సీసీఐ) నేరుగా రైతుల నుంచి పత్తిని మద్దతు ధరకు కొంటోంది. ఇకపై పత్తి రైతులు ఎవరికి విక్రయించినా మద్దతు ధర అందేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మద్దతు ధరకు.. రైతులు అమ్ముకున్న ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నిబంధనలు అనుసరించి ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుంది.
ఇప్పటికే పలు పంటలను నేరుగా కొనే పరిమితిని బాగా తగ్గించిన కేంద్రం, తాజాగా పత్తిపై దృష్టి పెట్టింది. కొత్త విధానం అమలుపై రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అభిప్రాయాలు కోరింది. ఏటా 24 పంటలకు కేంద్రం మద్దతు ధరలను ప్రకటిస్తోంది. వీటిలో పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను నేరుగా కొంతమేర కొంటోంది. పత్తిని సీసీఐతో కొనుగోలు చేయిస్తోంది.
మార్కెట్ సగటు ధర ఆధారంగా రైతులకు చెల్లింపు
గతంలో మధ్యప్రదేశ్‌లో సోయాచిక్కుడు, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర అందించేందుకు ‘భవంతర్ భుగ్టన్ యోజన’(బీబీవై) పథకాన్ని అమలు చేశారు. దీని ప్రకారం రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కాకుండా ఎక్కడైనా, ఎవరికైనా పంటను అమ్ముకోవచ్చు. విక్రయ ధర తెలిపే రశీదులను సమీప వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అదేరోజు అప్పగించాలి. వారి నుంచి కొన్న వ్యాపారులు ఆన్‌లైన్ ద్వారా రైతు పేరు, చెల్లించిన ధరలను నమోదు చేసినా సరిపోతుంది. రైతు పంటను అమ్మిన రోజు రాష్ట్రమంతా వివిధ మార్కెట్లలో, చుట్టుపక్కల 2 రాష్ట్రాల్లో ఎంత ధర ఉందో పరిశీలించి మార్కెటింగ్ శాఖ ప్రతిరోజూ ఆ పంటకు రాష్ట్ర సగటు ధర నిర్ణయించేది. ఆ పంట మద్దతు ధర కంటే, ఈ సగటు ధర తక్కువగా ఉంటే.. ఆ వ్యత్యాసాన్ని రైతుకు చెల్లించేది. పత్తి మద్దతు ధర ప్రస్తుతం క్వింటాకు రూ.5,550 ఉంది.
ఉదాహరణకు ఒక రోజు రాష్ట్ర సగటు ధర రూ.5 వేలుగా నిర్ణయిస్తే, మద్దతు ధరకు- రాష్ట్ర సగటు ధరకు మధ్య ఉన్న అంతరం రూ.550ని మాత్రమే ప్రభుత్వం రైతుకు చెల్లిస్తుంది. ఆ రోజు ప్రకటించిన సగటు ధరకన్నా రైతు తక్కువకు అమ్ముకున్నా.. ప్రభుత్వం సగటు ధరనే పరిగణనలోకి తీసుకుంటుంది.
ఏ విధానంలోనైనా ఎక్కువ పరిమాణంలో కొనాలి
ఏ పంటనైనా రాష్ట్ర దిగుబడిలో 25 శాతం మాత్రమే కొనాలని కేంద్రం నిబంధన పెట్టింది. దీనిని పత్తికి అమలుచేస్తే రైతులకు నష్టం జరుగుతుందని... పరిమితులు పెట్టి కొద్ది పంటనే కేంద్రం కొంటే, మిగతా పంటకు వ్యాపారులు ధర తగ్గించేస్తారని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఏ పంటను ఏ విధానంలోనైనా ఎక్కువ పరిమాణంలో కొంటేనే రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఎక్కువ మందికి మద్దతు ధర అందేలా చూడాలని కేంద్రానికి చెప్పినట్లు స్పష్టం చేశారు.