తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో లక్ష్యానికి మించి పత్తిసాగు... దిగుబడిపైనే గంపెడాశలు! - రాష్ట్రంలో జోరుగా పత్తిపంట సాగు వార్తలు

రాష్ట్రంలో పత్తి విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. నియంత్రిత సాగు విధానం అమలులో భాగంగా తెల్లబంగారంపై రైతులు అధికంగా మొగ్గు చూపుతున్నారు. పెట్టుబడి, శ్రమ అధికంగా ఉన్నా నికరంగా ఆదాయం ఇచ్చే పంట కావడం వల్ల పత్తి సాగు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. అన్నదాతలు ఈ సారి అనుకున్న లక్ష్యానికి మించి సాగుచేశారు.

Cotton cultivation in full swing in the state .. Farmers cultivated beyond the target
రాష్ట్రంలో జోరుగా పత్తిపంట సాగు.. లక్ష్యాన్ని మించి సాగు చేసిన రైతులు

By

Published : Jul 19, 2020, 11:22 AM IST

Updated : Jul 19, 2020, 12:14 PM IST

నియంత్రిత సాగు విధానం అమలులోకి తెచ్చిన ప్రభుత్వం.. ప్రధాన ఆహార పంటైన వరితో పాటు పత్తి, కంది, ఇతర చిరుధాన్యాలు సాగు చేయాలని పిలుపునిచ్చింది. ఈ ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 1 కోటి 34 లక్షల 77 వేల 15 ఎకరాల లక్ష్యంగా వ్యవసాయ శాఖ నిర్ధేశించుకుంది.

ఇప్పటి వరకు 74 లక్షల 44 వేల 603 ఎకరాల్లో పనులు పూర్తయ్యాయి. అందులో 27 లక్షల 25 వేల 58 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు లక్ష్యం కాగా.. 27 శాతం మేర నాట్లు వేశారు. 44 లక్షల 50 వేల 29 ఎకరాలు పత్తిసాగు నిర్దేశించుకోగా.. అంతకుమించి 50 లక్షల 80 వేల 50 ఎకరాల్లో పూర్తైంది.

114 శాతం వరకు పత్తిసాగు జరిగిందని అధికారులు తెలిపారు. కంది సాధారణ సాగు విస్తీర్ణం 7 లక్షల 61 వేల ఎకరాలకు గానూ 7 లక్షల 55 వేల 825 ఎకరాల్లో.. అంటే దాదాపు 99 శాతం లక్ష్యం పూర్తైంది. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు, వరంగల్, ఆదిలాబాద్ తదితర ఉమ్మడి జిల్లాల్లో వ్యవసాయ శాఖ అంచనాలకు మించి పత్తి పంట సాగు జరిగింది.

భయాందోళనల మధ్య సేద్యం..

కరోనా నేపథ్యంలో ఇప్పటికే కుదేలైన వ్యవసాయ రంగం ఎప్పుడు కోలుకుంటుందోనన్న భయాందోళనల మధ్య సేద్యం సాగుతోంది. ప్రకృతి విపత్తుల బారి నుంచి రక్షణ కవచంలా ఉండాల్సిన పంట బీమా పథకం నోటిఫికేషన్ జారీ కాలేదు.

ఈ సంవత్సరం అసలు ఈ పథకమే రాష్ట్రంలో అమల్లో లేదు. సీఎం సూచన మేరకు ఈ సీజన్‌లో మొక్కజొన్న సాగుకు దాదాపు రైతులు దూరంగా ఉన్నారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో యాసంగిలో వేసుకునేందుకు ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మార్కెటింగ్‌ ఇబ్బందులు ఉండవన్న ధీమాతో అధిక శాతం పత్తి సాగు చేస్తున్నారు.

వేధిస్తున్న కూలీల కొరత..

క్షేత్రస్థాయిలో కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒక్క పత్తిలోనే కాదు.. ప్రధాన ఆహార పంట వరి సాగులో సైతం ఇబ్బందులు తప్పడం లేదు. పొరుగు ఊర్లు లేదా ఇతర జిల్లాల నుంచి కూలీలు వస్తే వైరస్‌ భయంతో స్థానికంగా అడ్డుకుంటున్నారు. చిన్న యంత్రాలు, పనిముట్లు వాడుకోవడం ద్వారా కూలీల కొరత నుంచి అధిగమించవచ్చని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఏర్పాట్లు చేయాలి..

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని ఇప్పట్నుంచే పత్తి సేకరణ, కొనుగోళ్లు, నగదు చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఒకేసారి పంట చేతికి వచ్చి మార్కెట్‌కు పోటెత్తినా.. దళారుల జోక్యం లేకుండా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టేందుకు భారత పత్తి సంస్థ, జిన్నింగ్ మిల్లు యాజమాన్యాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.

రాష్ట్రంలో జోరుగా పత్తిపంట సాగు.. లక్ష్యాన్ని మించి సాగు చేసిన రైతులు

ఇదీచూడండి: మాఫీ అయితేనే.. మంజూరు చేస్తరట!

Last Updated : Jul 19, 2020, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details