Cotton Crop: పత్తి పంటకు రికార్డుస్థాయిలో ధర వస్తోందని ఆనందించాలో, దిగుబడి రాలేదని దిగులు పడాలో తెలియని అయోమయంలో రైతులున్నారు. క్వింటాకు మద్దతు ధర రూ.6,025 కాగా.. అంతకుమించి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ వ్యాపారులు కొన్నారు. ఏటా అక్టోబరులో కొత్త పంట మార్కెట్లకు రావడం మొదలుకాగానే సరైన ధర దక్కక రైతులు నష్టపోయేవారు. ‘భారత పత్తి సంస్థ’(సీసీఐ)పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించేది. గత ఐదేళ్లలో తొలిసారి ఈ ఏడాది సీసీఐ రాలేదు. మద్దతు ధరకు కొనాలంటూ రాష్ట్ర ప్రభుత్వమూ ఒత్తిడి చేయలేదు. వ్యాపారులే గ్రామాలకు వెళ్లి మద్దతు ధర లేదా అంతకన్నా ఎక్కువే చెల్లించడం వల్ల తాము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవసరం రాలేదని సీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే ధర బాగానే ఉన్నా రైతులకు ఆనందమేమీ దక్కలేదు. దిగుబడి తగ్గిపోవడమే ఇందుకు కారణం.
పడిపోయిన దిగుబడి...
రాష్ట్రంలో ఈ ఏడాది 46.42 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఎకరానికి కనీసం 3 క్వింటాళ్లు పండినా ఇప్పటికే కనీసం కోటీ 40 లక్షల క్వింటాళ్లకు పైగా రాష్ట్రంలోని 300 జిన్నింగ్ మిల్లులకు రావాలి. కానీ, గత అక్టోబరు నుంచి ఇప్పటివరకూ కోటీ 25 లక్షల క్వింటాళ్లే వచ్చినట్లు వ్యాపారుల అంచనా. పైగా వ్యవసాయ మార్కెట్లలో 79.30 లక్షల క్వింటాళ్లకు మించి అమ్మకాలు జరగలేదు. వ్యాపారులు పొలాలు, రైతుల ఇళ్ల వద్ద మిగిలింది కొని జిన్నింగ్ మిల్లులకు తరలించారు. రాష్ట్రంలోకెల్లా పెద్దదైన ఖమ్మం మార్కెట్‌కు 2020-21 అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకూ 3.19 లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా.. ఈ ఏడాది(2021-22) అదే కాలవ్యవధిలో 2.65 లక్షల క్వింటాళ్లే వచ్చింది. దిగుబడి గణనీయంగా పడిపోయిందని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
వర్షాలు, పురుగుల దెబ్బతో...
గతేడాది జూన్ 3న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి.. వర్షాలు మొదలవగానే రైతులు పంట సాగు ప్రారంభించారు. కానీ, జులై నుంచి అక్టోబరు దాకా ఎడతెరిపిలేని వర్షాలతో లక్షల ఎకరాల్లో పైరు దెబ్బతిందని వ్యవసాయాధికారులు తెలిపారు. అధిక తేమ వల్ల గులాబీ రంగు పురుగు, ఇతర తెగుళ్లు మరికొంత దెబ్బతీశాయి. వర్షాలు, తెగుళ్లతో దిగుబడి గణనీయంగా తగ్గి.. మార్కెట్లకు పెద్దగా రాలేదని మార్కెటింగ్‌శాఖ తాజా అంచనా.
7 ఎకరాలకు 20 క్వింటాళ్లే దిగుబడి వచ్చింది..