పుడమితల్లిని నమ్ముకుని.. అందరికీ అన్నం అందించేందుకు ఆరుగాలం కష్టపడుతున్న రైతులకు చివరికి ఏమీ మిగలడం లేదు. సాగు ఖర్చులు ఏటేటా పెరుగుతుండటంతో.. రాబడి గగనంగా మారుతోంది. ప్రకృతి విపత్తులు, తెగుళ్లతో పంట దిగుబడి తగ్గిపోతుండటంతో.. ఒకవేళ మార్కెట్లో ధర బాగున్నా వచ్చే ఆదాయం పెట్టుబడికే సరిపోతోందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాసంగి (రబీ) పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
వరి నాట్లు జోరుగా వేస్తున్నారు. మరోవైపు వానాకాలంలో పండించిన ధాన్యం, పత్తి తదితర పంటలను రైతులు మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో సాగుకు ఎంత ఖర్చవుతోంది, పంటలు అమ్మితే చేతికి ఎంత తిరిగొస్తోందనే అంశంపై పలు జిల్లాల రైతులను ‘ఈనాడు’ పలకరించగా.. పెట్టుబడీ తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వానాకాలంలో అధిక వర్షాలు, తెగుళ్లతో పత్తి, వరి దిగుబడులు తగ్గాయి.
పంటలను వ్యాపారులు మద్దతు ధరకు కొంటున్నా దిగుబడి పెద్దగా రాకపోవడంతో నష్టాలే మిగులుతున్నాయని పలువురు రైతులు తెలిపారు. దిగుబడి ఎక్కువగా రానందువల్లే మద్దతు ధర ఇస్తున్నారని వారు చెబుతున్నారు. రాష్ట్రంలో గత వానాకాలంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. యాసంగిలో 43 లక్షల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా. నాట్లు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. డీజిల్, కూలి రేట్లు, పురుగుమందుల ధరలు పెరిగాయి.
దీంతో గతేడాది యాసంగితో పోలిస్తే పెట్టుబడి మరింత పెరుగుతోంది. జిల్లాలను బట్టి నాట్లు వేసే సమయానికే ఎకరాకు రూ.12-14 వేలు పెట్టాల్సి వస్తోంది. గతేడాది రూ.10 వేలే సరిపోయింది. సంకరజాతి వరి విత్తనాలంటూ కొన్ని ప్రైవేటు కంపెనీలు కిలో విత్తనాలను రూ.370కి అమ్ముతున్నాయి. సాధారణ విత్తనాలనూ 10 కిలోల సంచిని రూ.900కి అమ్ముతున్నారు. ఒక్కో కంపెనీ బ్రాండ్ల పేరుతో ధరలను అమాంతం పెంచేశాయి. కలుపు నివారణకు చల్లే రసాయన మందు లీటరు ధర గతేడాది రూ.600 ఉండగా.. ఇప్పుడు రూ.950కి చేరుకుంది. మగ కూలీలకు జనగామ జిల్లా నవాబ్‌పేట ప్రాంతంలో రోజుకు రూ.900 చొప్పున చెల్లిస్తున్నారు. ఇలా ప్రతి పనికి పెట్టే ఖర్చు పెరిగిపోయిందని రైతులు తెలిపారు.
అంచనాలకు, ఖర్చులకు పొంతనేది?:సాగు వ్యయంపై వ్యవసాయశాఖ అంచనాలకు, రైతులు క్షేత్రస్థాయిలో పెడుతున్న ఖర్చులకు పొంతనే ఉండటం లేదు. ఉదాహరణకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎకరానికి అవసరమైన 25 కిలోల వరి విత్తనాలను రూ.900లోపే అమ్ముతుండటంతో దాన్నే విత్తన ఖర్చుగా వ్యవసాయశాఖ లెక్కిస్తోంది. కానీ, పలు ప్రైవేటు కంపెనీలు 10 కిలోల విత్తనాల సంచిని రూ.600 నుంచి 950 దాకా అమ్ముతున్నాయి.
ఇక రసాయన పురుగుమందుల ధరల నియంత్రణ వ్యవసాయశాఖ పరిధిలో లేదు. దీంతో ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. డీజిల్ ధరల పెరుగుదల ప్రభావంతోనూ పలు ప్రాంతాల్లో సాగు ఖర్చులు 10 నుంచి 20 శాతం పెరిగాయి. విత్తనాలు వేసే ముందు దుక్కికి ట్రాక్టర్లు మొదలు పంటకోత, మార్కెట్‌కు తరలింపు వరకూ యంత్రాలను వినియోగిస్తున్నారు. డీజిల్ ధరల పెరుగుదల వల్ల వాటి కిరాయిలనూ పెంచేస్తున్నారు.