తెలంగాణ

telangana

ETV Bharat / state

TS news: గుత్తేదార్ల అవతారం ఎత్తుతున్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు.. ఇష్టారాజ్యంగా పనులు

రాష్ట్రంలోని పలు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో కంచె చేను మేస్తున్న పరిస్థితి తాండవిస్తోంది. తెల్లని ఖద్దరు దుస్తుల్లో కనిపించే కార్పొరేటర్లు (corporators), కౌన్సిలర్లు (councilors) కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి అవినీతికి పాల్పడుతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు.

Corporators and councilors incarnating as monopolies
గుత్తేదార్ల అవతారం ఎత్తుతున్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు.. ఇష్టారాజ్యంగా పనులు

By

Published : Sep 17, 2021, 7:04 AM IST

Updated : Sep 17, 2021, 9:34 AM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో నాణ్యత లేకుండా నిర్మించిన కొత్త రోడ్డు ఇది. ఈ పురపాలక సంఘంలో సుమారు పది మంది ప్రజా ప్రతినిధులు పరోక్షంగా కాంట్రాక్టర్లుగా ఉన్నారు. నిధుల కొరత ఉన్నా టెండర్లు పిలిచి ముందస్తు పనులు అప్పగిస్తున్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ప్రగతి పనుల్లో నాణ్యత లోపించింది.

తెల్లని ఖద్దరు దుస్తుల్లో కనిపించే కార్పొరేటర్లు (corporators), కౌన్సిలర్లు (councilors) కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి అవినీతికి పాల్పడుతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. కొన్ని చోట్ల మేయర్‌లు, ఛైర్‌పర్సన్‌ల కుటుంబసభ్యులే బినామీ కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తూ అవసరంలేని పనులు చేపడుతూ రూ.కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారు. పురపాలక సంఘాల్లో ఏ పనులు చేయాలో నిర్ణయించేది వాళ్లే.. ఆ పనులకు ధరలను ఖరారు చేసేదీ వాళ్లే.. చివరకు టెండర్లు దక్కించుని పనులు చేసేది వాళ్లే. వారు చేసిన, చేస్తున్న పనుల్లో నాణ్యత లోపిస్తోంది. మరికొన్ని అసంపూర్తిగా మిగిలిపోతున్నాయి. అయినా అధికారులను బెదిరించి బిల్లులను వసూలు చేసుకుంటూ జేబులు నింపుకొంటున్నారు. ప్రజలకు కడగండ్లు మిగులుస్తున్నారు. కొన్ని నగరపాలక, పురపాలక సంఘాల్లో పరిస్థితులను పరిశీలిస్తే...

మా పనులను పరిశీలించొద్దు

కరీంనగర్‌ నగరపాలక సంస్థలో సుమారు 15 మందికి పైగా ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా పరోక్షంగా కాంట్రాక్టర్లుగా ఉన్నారు. వీరు పనులు చేసే సమయంలో పర్యవేక్షణ ఉండకూడదని, పనుల్లో నాణ్యతలేకున్నా పట్టించుకోరాదని ఇంజినీరింగ్‌ అధికారులకు హుకుం జారీ చేస్తుండటం గమనార్హం. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులను తమ కాంట్రాక్టు పనులకు ఉపయోగించుకుని బిల్లులు చేసుకుంటున్నారు. పాలకవర్గ సభ్యులు వారే కావడంతో అధికారులు మౌనంగా ఉంటున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ సమయంలో స్థానికులు ఫిర్యాదు చేస్తే కన్నెత్తి చూడటం లేదు. కొందరు అధిక మొత్తంలో రికార్డు చేయించుకొని బిల్లులు ముందుగానే తీసుకుంటున్నారు. నాణ్యత లేకపోవడంతో ఏడాది తిరగకముందే నిర్మాణాలకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. కొందరు టెండర్లు దక్కించుకొని పనులు చేయకుండా ఉండిపోతున్నారు.

నల్గొండలో బెంబేలెత్తుతున్న అధికారులు

నల్గొండ పురపాలక సంఘంలో కొందరు కౌన్సిలర్లు పనులు పూర్తి చేయకుండానే బిల్లులు చెల్లించాలని ఒత్తిళ్లు తెస్తున్నారు. సిమెంటు రహదారులు, మురుగుకాల్వల నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండటంలేదు. పనులు నాసిరకంగా ఉండటంతో రోడ్లు వేసిన నెలల వ్యవధిలోనే గుంతలు పడిపోతున్నాయి. కొంత మంది కౌన్సిలర్ల అనుచరులు, కుటుంబ సభ్యుల ఒత్తిళ్లతో కొందరు ఏఈలు ఇక్కడ పనిచేయబోమని డిప్యుటేషన్‌పై వెళ్లిన ఘటనలు ఉన్నాయి.

భూపాలపల్లిలో నత్తనడక

భూపాలపల్లి పట్టణంలో ప్రజాప్రతినిధులు చేపట్టిన పలు సీసీ రోడ్లు, మురుగు కాలువలు, ఇతర అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. రూ.6 లక్షల నిధులతో నిర్మించిన మురుగు కాలువ కొద్ది రోజులకే కూలిపోవడం గమనార్హం. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో రూ.1.20 కోట్లతో 2019లో చేపట్టిన కూరగాయల మార్కెట్‌ నిర్మాణ పనులు నేటికీ పూర్తి కాలేదు. డబుల్‌ రోడ్డు పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. నిర్మాణాల్లో నాణ్యత కొరవడినా పట్టించుకోవటం లేదు.

కఠినంగా వ్యవహరిస్తే ఇబ్బందే..

కాంట్రాక్టర్లయిన కౌన్సిలర్ల పనుల్లో నాణ్యతను ప్రశ్నించినా, సకాలంలో పూర్తి చేయడంలేదని అడిగినా, పనులు పూర్తికాలేదని బిల్లులు ఆపినా పురపాలక అధికారులను వారు ఇబ్బందిపెడుతున్నారు. అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల వద్ద ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారు. లేదంటే ఆ అధికారి వద్దని ప్రతిపాదిస్తున్నారు.

ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లుగా చేపట్టిన మరికొన్ని పనుల పరిస్థితి..

  • పూర్వపు మెదక్‌ జిల్లా పరిధిలోని ఓ పురపాలక సంఘంలో 14 మంది కౌన్సిలర్లు పరోక్షంగా, ప్రత్యక్షంగా కాంట్రాక్టర్లుగా ఉన్నారు. ఈ పట్టణంలో నిర్మించిన మురుగు కాలువల పనుల్లో నాణ్యతలేక మధ్యలో కంకర రాళ్లు తేలిపోతున్నాయి.
  • కొల్లాపూర్‌లో మూడేళ్ల క్రితం రూ.5 కోట్లతో వేసిన సీసీరోడ్లు పలు చోట్ల అప్పుడే దెబ్బతిన్నాయి. వాకింగ్‌ ట్రాక్‌ పనుల్లో నాణ్యతలేదు.
  • సూర్యాపేటలో రోడ్లు, మురుగు నీటి కాలువల పనుల్లో అత్యధికం నాసిరకంగా ఉన్నాయి. మురుగు కాల్వలను సగం వరకు నిర్మించి వదిలేయడం గమనార్హం. పూర్తికాని పనులకు బిల్లులు చెల్లించాలని పైరవీలు చేయడంతో అధికారులు సతమతమవుతున్నారు. అసంపూర్తి పనులపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందినా అధికారులూ నిస్సహాయంగా ఉన్నారు.
  • కోస్గిలో అసంపూర్తి పనులకు బిల్లులు చెల్లించాలంటూ కమిషనర్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఓపెన్‌ జిమ్‌ పనులు అసంపూర్తిగా ఉండగా, సీసీ రోడ్డు పనులు, డ్రైనేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
  • జగిత్యాల పట్టణంలో మురుగుకాల్వలు అసంపూర్తిగా నిర్మించడంతో దిగువ ప్రాంతాల్లోకి మురుగు చేరుతోంది. వరదల సమయంలో జనావాసాల్లోకి నీరు చేరుతోంది. బల్దియాలో గుంతలు తీసే వాహనమున్నా కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం గుంతలు తీసి మొక్కలు నాటేందుకు రూ.34 లక్షల మేరకు టెండర్లు నిర్వహించడం గమనార్హం.
  • రామగుండంలో పూడికతీత పనులు నామమాత్రంగా ఉన్నా యథాతథంగా బిల్లులు చెల్లిస్తున్నారు.

ఇదీ చదవండి:KTR FIRES ON REVANTH REDDY: టీపీసీసీగా రేవంత్​రెడ్డి ఎంపికపై కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

Last Updated : Sep 17, 2021, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details