Telangana Corporate Junior Colleges : తెలంగాణలో దాదాపు ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకే వెళ్తున్నారు. 9.50 లక్షల మందిలో 5 లక్షల మంది వరకు ఈ కళాశాలల బాటే పడుతున్నారు. ఇందులో ఏడాదిలో రెండు మూడు కళాశాలల్లోని విద్యార్థులు ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దానికి కారణం మార్కుల కోసం ఆయా కాలేజీలు పిల్లలపై ఒత్తిడి పెంచడమేనన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా దీనిపై అటు ఇంటర్ బోర్డు కానీ.. ఇటు విద్యాశాఖ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
విద్యార్థుల ఆత్మహత్యలు పట్టించుకోని బోర్డు.. 2017లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా జరగడం వల్ల.. 20 ఏళ్ల క్రితం ఆచార్య నీరదారెడ్డి కమిటీ సిఫార్సు చేసిన ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయినా వాటిని పట్టించుకున్న నాథుడేలేడు. ఫలితంగా 2019లో పరీక్షల ఫలితాల్లో ఇంటర్ బోర్డు చూపిన నిర్లక్ష్యం వల్ల పలువురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఆ తర్వాత చర్యలు చేపట్టిన బోర్డు.. కాలేజీకి ఒక అధ్యాపకుడిని స్టూడెంట్ కౌన్సిలర్‌గా నియమించింది. పరీక్షలు, ఫలితాల సమయంలో సైకాలజిస్టులను కూడా నియమించి విద్యార్థులకు ఎలాంటి అనుమానాలు, ఒత్తిడి ఉన్నా వారిని సంప్రదించొచ్చని ఫోన్ నంబర్లు ఇచ్చారు. ఇక తాజాగా వాటి స్థానంలో టోల్ ఫ్రీ నంబర్‌ను విద్యార్థుల కోసం తీసుకొచ్చారు.
లక్షల్లో ఫీజులు.. హాస్టళ్లకు అనుమతులు మాత్రం అనవసరం..ఇక ఫీజుల భారం రోజురోజుకు విద్యార్థుల తల్లిదండ్రులకు శాపంగా మారుతున్నా.. వాటిపై నియంత్రణ కరవైంది. ఫీజుల నియంత్రణకు చర్యలు చేపడతామని ప్రభుత్వం గతేడాది జనవరిలో ప్రకటించింది. కానీ ఆ దిశగా చర్యలు మాత్రం శూన్యం. చిన్న జనరల్‌స్టోర్ పెట్టుకున్నా.. జీహెచ్‌ఎంసీ, వాణిజ్య పన్నుల శాఖకు డబ్బు చెల్లించి పర్మిషన్ తీసుకుంటారు. కానీ వందల మంది విద్యార్థులు.. లక్షల్లో ఫీజులు కడుతున్నా.. హాస్టళ్లకు మాత్రం అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండకపోవడం కాస్త విడ్డూరమే.