తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా చికిత్సలకు కార్పొరేట్‌ ఆసుపత్రుల అడ్డగోలు వసూళ్లు - కార్పొరేట్​ ఆస్పత్రుల వార్తలు

కరోనా పాజిటివ్‌ బాధితుడు ఒకరు ఆయాసంతో హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరాడు. రెండు రోజులు ఐసీయూలో చికిత్స అనంతరం కోలుకోవడం వల్ల సాధారణ గదిలోకి మార్చారు. 14 రోజుల చికిత్స అనంతరం రూ. 18.22 లక్షల బిల్లు వేశారు. అప్పటికే రూ. 10 లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని కడితేనే డిశ్ఛార్జి చేస్తామనడం వల్ల అప్పు చేసి బిల్లు చెల్లించాల్సి వచ్చింది.

కరోనా చికిత్సలకు కార్పొరేట్‌ ఆసుపత్రుల అడ్డగోలు వసూళ్లు
కరోనా చికిత్సలకు కార్పొరేట్‌ ఆసుపత్రుల అడ్డగోలు వసూళ్లు

By

Published : Jul 28, 2020, 6:20 AM IST

‘డబ్బు చెల్లిస్తేనే ఆసుపత్రిలోకి ప్రవేశం.. లేదంటే ఎంతటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా వెనక్కి పంపేయడమే.. రూ.లక్షల్లో ప్రైవేటు బీమా ఉన్నా.. నగదు ఉంటేనే కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో బెడ్‌ కేటాయింపు. చేరేటప్పుడే రూ.లక్ష కట్టాల్సిందే. తర్వాత చికిత్సను బట్టి రోజుకు రూ.50,000 నుంచి రూ.లక్ష బిల్లు. అంతసొమ్ము చెల్లించినా చివరకు ప్రాణం దక్కకుంటే.. మిగిలిన సొమ్ము కడితేనే మృతదేహం అప్పగిస్తామంటున్నారు." అని కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులపై కొవిడ్‌ బాధితులు, వారి కుటుంబ సభ్యులు చేస్తున్న ఫిర్యాదులివి.

ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలపై ఫిర్యాదులుంటే తెలియజేయాలంటూ.. ప్రభుత్వం ‘91541 70960’ వాట్సప్‌ నంబరు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి గత 11 రోజుల్లోనే దాదాపు 1000కి పైగా ఫిర్యాదులొచ్చినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. వాటిలో అడ్డగోలు రుసుములపైనే బాధితులు ఎక్కువగా గోడు వెళ్లబోసుకున్నారు. అప్పులు చేసైనా చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చారు.

కృత్రిమ కొరత.. కాసుల వరద

ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తమ ఆసుపత్రుల్లో పడకలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని చెబుతున్నా.. కరోనా బాధితుల్లో మధ్యతరగతి వర్గాలు కూడా ప్రైవేటు ఆసుపత్రుల బాటే పడుతున్నారు. పడకలు ఖాళీ లేవంటూ ప్రచారం జరుగుతుండడం వల్ల కొన్ని ఆసుపత్రులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పెద్ద స్థాయిలో పైరవీ చేయించుకుంటే గానీ పడక లభించని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వారు ఎంతంటే అంత కట్టాల్సి వస్తోంది.

కొన్ని ప్రైవేటు ఆసుపత్రులైతే చేరిన మొదటి రోజు నుంచే కనీసం రూ.లక్ష కట్టించుకుంటున్నాయి. ఇందులో ‘బాగా గుర్తింపు పొందిన’ కార్పొరేట్‌ ఆసుపత్రులతోపాటు ‘అంతగా గుర్తింపులో లేని’ ఆసుపత్రులూ ఉండడం గమనార్హం. దాదాపు అన్నిచోట్లా ‘డబ్బు చుట్టే చికిత్స’ తిరుగుతోందనేది బాధితుల ఫిర్యాదులను పరిశీలిస్తే అర్థమవుతోంది.

ప్రభుత్వం చెప్పిందేంటి?

* ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలకు ఛార్జీలను మూడు రకాలుగా ఖరారు చేసింది.

* రోజుకు ఐసొలేషన్‌లో రూ.4,000, ఐసీయూలో రూ. 7,500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ చికిత్సకు రూ. 9,000 చొప్పున వసూలు చేయాలని ఆదేశాలిచ్చింది. రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఈసీజీ, 2డీ ఎకో, ఎక్స్‌రే, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ బి, సి.. తదితర పరీక్షల ఖరీదు, కొన్ని సాధారణ ఔషధాలను కూడా ఇందులో చేర్చింది.

* కొన్ని ఖరీదైన ఔషధాలు, ఖర్చుతో కూడిన నిర్ధరణ పరీక్షలు, పీపీఈ కిట్లు, ఎన్‌ 95 మాస్కులకు మినహాయింపు ఇచ్చింది.

* నిర్ధరణ పరీక్షలకు 2019 డిసెంబరు 31 నాటికి ఆ ఆసుపత్రిలో ఎంత ధర ఉందో.. అంతే వసూలు చేయాలని స్పష్టంచేసింది.

* కరోనా పరీక్షలను ప్రైవేటు ల్యాబ్‌లో చేస్తే రూ. 2,200, ఇంటికొచ్చి నమూనా స్వీకరిస్తే రూ. 2,800గా నిర్ణయించింది.

* అత్యధిక ఆసుపత్రుల్లో ఈ ఉత్తర్వులు అమలు కావడం లేదు. ఐసొలేషన్‌ వార్డులో ఉన్నా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఇక బిల్లులోనే కాదు.. చికిత్సల్లోనూ పారదర్శకత పాటించడంలేదని బాధితులు వాపోయారు.

సర్కారుకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..

* ఈసీఐఎల్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో రూ. లక్ష కడితేనే చేర్చుకుంటామన్నారు. 4 రోజుల చికిత్స అనంతరం బాధితుడు మృతిచెందగా రూ. 4 లక్షలు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామన్నారు. దీంతో బంధువులు మొత్తం చెల్లించారు. విశేషమేమిటంటే.. అసలు ఈ ఆసుపత్రికి కొవిడ్‌ చికిత్సకు అనుమతే లేదని వైద్యవర్గాలు చెప్పాయి.

* మూత్రపిండాల వ్యాధి కారణంగా ఓ వ్యక్తి కూకట్‌పల్లిలోని ఒక ఆసుపత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. ఇంతలో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఈనెల 15న అత్యవసర పరిస్థితుల్లో అర్ధరాత్రి 12.30 గంటలకు ఆసుపత్రిలో చేరాడు. కోలుకోవడం వల్ల మర్నాడు ఉదయమే డిశ్ఛార్జి చేశారు. ఒక్క మాత్ర కానీ, ఇంజక్షన్‌ కానీ ఇవ్వనేలేదు. కేవలం 6 గంటలు ఉన్నందుకు రూ. 80,000 బిల్లు వేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. అక్కడి వైద్యాధికారి తీవ్ర పదజాలంతో దూషించారనీ, దురుసుగా వ్యవహరించారని ఫిర్యాదుదారు వాపోయారు.

* బంజారాహిల్స్‌లోని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో గుండె కవాట మార్పిడి చికిత్స పొందిన ఒక బాధితుడు కరోనా లక్షణాలు కనిపించడం వల్ల గచ్చిబౌలిలోని మరో కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించి నెగిటివ్‌గా తేల్చారు. ఒకరోజు బిల్లు రూ. 70,000 అయింది.

* ఒక కరోనా బాధితుడు పలు ఆసుపత్రులకు తిరిగాడు. చివరకు సోమాజీగూడలోని ఒక ఆసుపత్రిలో ఐసొలేషన్‌లో చేరాడు. ముందుగానే రూ. 3 లక్షలు చెలించాల్సి వచ్చింది.

* సికింద్రాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో 18 రోజులు ఉంటే.. రూ. 20 లక్షలు బిల్లు వేశారు.

మందుల ఖర్చు 5.23 లక్షలు

ఒక బాధితుని బిల్లులో.. పీపీఈ కిట్టుకు రోజుకు రూ. 15,000, ఎంఆర్‌ఐకు రూ. 24,000 చేశారు. మొత్తం బిల్లు రూ. 18 లక్షలు. ఇందులో డాక్టర్‌ ఫీజు 2.32 లక్షలు, మందుల ఖర్చు 5.23 లక్షలు. మాదాపూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అడ్డగోలుగా వసూలు చేయడంతో పాటు.. ఆ బిల్లులైనా ఇవ్వడం లేదు. బంజారాహిల్స్‌లోని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఆర్‌టీ-పీసీఆర్‌ కరోనా టెస్టుకు రూ. 12,000 కట్టాల్సిందే. ఇందులో వైద్యుని సంప్రదింపులు తప్పనిసరి చేసి వసూలు చేస్తున్నారు.

ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ABOUT THE AUTHOR

...view details