తెలంగాణ

telangana

By

Published : Jun 26, 2020, 8:18 PM IST

ETV Bharat / state

గ్రేటర్‌లో కరోనా పంజా... మూతబడుతోన్న కార్యాలయాలు

గ్రేట‌ర్ హైద‌రాబాద్ పరిధిలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రతి రోజు వెయ్యి కొత్త కేసులు వచ్చి చేరుతుండటం జంటనగర వాసుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. వైర‌స్ న‌గ‌రంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు విస్తరించటంతో పాటు అనేక ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల మూతకు కారణమవుతోంది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన దుకాణాల యజమానులు వచ్చే పది రోజుల పాటు స్వచ్ఛందంగా నియంత్రిత పద్ధతిలో తెరవాలని నిర్ణయించారు.

corona virus
corona virus

జంట న‌గ‌రాల్లో క‌రోనా తీవ్రత కొనసాగుతోంది. ప్రతి రోజు కొత్త కేసులు వెయ్యికి చేరువవుతున్నాయి. ఇవాళ కూడా న‌గ‌రంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో భారీగా కేసులు న‌మోద‌య్యాయి. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో పనిచేస్తోన్న హెడ్‌నర్స్ క‌రోనాతో గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 20 రోజుల పాటు ఆసుప‌త్రిలో క‌రోనా విధులు నిర్వహించినట్టు చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఈ నెల 30తో ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆమె భర్తకి కరోనా పాజిటివ్ రావ‌డంతో హోం క్వారంటైన్‌లో ఉంచారు.

అంబర్‌పేటలో ఒక్కరోజే 42

అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో ఇవాళ 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ డివిజన్ పరిధిలో 15, నల్లకుంట డివిజన్‌లో 10, కాచిగూడ డివిజన్‌లో 12, గోల్నాక డివిజన్‌లో 4, బాగ్ అంబర్‌ పేట్ డివిజన్‌లో ఒక కేసు నమోదైంది. కాచిగూడలో ఓ డాక్టర్‌తో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులకు పాజిటివ్ నిర్ధరణ అయింది. అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్‌తో పాటు పోలీస్ క్వార్టర్స్‌లో మరో ఇద్దరికి వైరస్ సోకింది. జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ కార్యాలయంలో ఒకరికి కరోనా సోకింది. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో సర్కిల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగికి కూడా పాజిటివ్ వచ్చింది. ఆ కార్యాల‌యానికి సంద‌ర్శకులను నిలిపివేసి.. శానిటైజ్ చేశారు. జీహెచ్ఎంసీ యూసఫ్‌గూడ సర్కిల్ కార్యాయంలో ట్యాక్స్ ఇన్​స్పెక్టర్​కు కోవిడ్ సోకడంతో కార్యాల‌యాన్ని శానిటైజ్ చేసి.. సిబ్బందిని ఇంటికి పంపించారు.

పంజా విసురుతోంది

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనూ కరోనా పంజా విసురుతోంది. ఇవాళ 25 కొత్త కేసులు నమోదయ్యాయి. జీడిమెట్ల, చింతల్, జగద్గిరిగుట్ట, నిజాంపేట్ ప్రాంతాల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. సురారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేకరించిన నమూనాలు సుమారు 500 పైగా ఉండగా.. అందులో సగానికి పైగా ఫలితాలు రావాల్సి ఉంది. నగర శివారు తుర్కయంజాల్ మున్సిపాలిటీలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. రాగన్నగూడ, కమ్మగూడ, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. బ్రాహ్మణపల్లిలో కరోనా వచ్చిన వ్యక్తి స్థానికంగా ఉండే ఓ చాకోలెట్ కంపెనీలో పనిచేస్తుండగా.. సదరు కంపెనీని వారం పాటు మూసివేయాలని వైద్యాధికారులు సూచించారు. తుర్కయంజాల్ పురపాలికల్లో మొత్తం 12 కేసులు నమోదు కాగా ఒక్క ఇంజాపూర్‌లోనే పది కేసులు నమోదయ్యాయి.

స్వచ్ఛందంగా బంద్

శామీర్‌పేట్‌లో ఓ మహిళకు కరోనా నిర్ధరణ అయింది. ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా సేవలందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కరోనాతో మృతిచెందారు. మీర్​పేట్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో 11 మందికి క‌రోనా సోకింది. క‌రోనా కేసులు ఎక్కువ కావ‌డంతో సికింద్రాబాద్ రాణిగంజ్‌లోని దుకాణాలను ఎనిమిది రోజులపాటు మూసివేస్తున్నట్లు స్థానిక మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది. మేడ్చల్ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వ్యాపార సముదాయాలు తెరిచి ఉంచాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. హైద‌రాబాద్ బేగం బ‌జార్, జ‌న‌ర‌ల్ బ‌జార్ కూడా సోమ‌వారం నుంచి వారం పాటు దుకాణాలు మూసి ఉంచాలని వ్యాపారులు నిర్ణయించారు.

ఆందోళనలు

కరోనా కట్టడి చర్యల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తన్నారని ఆరోపిస్తూ చంచల్ గూడ ప్రభుత్వ ముద్రణాలయం ఉద్యోగులు కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. గత నాలుగు రోజులుగా 8 మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డా... అధికారులు ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోవడం లేదని యూనియన్ నేతలు ఆరోపించారు. ఉద్యోగుల హాజరు నియమాన్ని పాటించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:జిల్లాలో ఒక్క రోజే 1.15 లక్షల మొక్కలు నాటాం: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details