తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీల్లోనే కరోనా జాస్తి! - corona virus spreading in basti

ఇరుకిరుకు గల్లీలు.. చిన్నచిన్న గదుల ఇళ్లు.. గుంపులు గుంపులుగా ఒకచోట చేరి ముచ్చట్లు చెప్పుకోవడం.. రహదారులపై మురుగు.. చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రత.. కుక్కలు, పందులు ఇళ్లముందే తిరుగుతుండటం.. వెరసి ఇదీ బస్తీల ముఖచిత్రం. ఇలాంటి బస్తీలు మహానగరంలోనూ ఎన్నో ఉన్నాయి. అసలు అక్కడ బస్తీలు ఉన్నాయన్న సంగతి సమీపంలోని కాలనీ వాసులకే తెలియదు.

corona virus mostly spread in bastis due to unhygienic surroundings
బస్తీల్లోనే కరోనా జాస్తి!

By

Published : May 14, 2020, 9:09 AM IST

బస్తీలే ఇప్పుడు కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఈ బస్తీలపై ముందు నుంచే దృష్టి పెట్టాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఫలితం ఉండదు. ముఖ్యంగా అంబర్‌పేట, జియాగూడ, ఆసిఫ్‌నగర్‌, వనస్థలిపురం, అల్లాపూర్‌ దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లోని బస్తీల్లో మొదలైన కరోనా పరంపర కాలనీలకూ పాకింది. దీంతో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.

వారం క్రితం గ్రేటర్‌లో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు రోజుల క్రితం జియాగూడ ప్రాంతంలో ఒక్కరోజునే 25 కేసులు నమోదయ్యాయి. వీరంతా గతంలో కరోనా నిర్ధారణ అయిన వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులే. వెంకటేశ్వరనగర్‌లోని 3 కుటుంబాల్లో అయిదుగురు, దుర్గానగర్‌లో 2 కుటుంబాల్లో 11 మంది, ఇందిరానగర్‌లో ఒక కుటుంబంలో ఇద్దరికి, సంజయ్‌నగర్‌లో 3 కుటుంబాల్లో ఏడుగురికి కరోనా సోకింది.

14 కేసుల్లో జియాగూడ పరిధిలోని దుర్గానగర్‌, వెంకటేశ్వరనగర్‌, పన్నిపురం, సబ్జిమండి, మేకలమండిలో దాదాపు 71 వరకు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఆసిఫ్‌నగర్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. జియాగూడ, ఆసిఫ్‌నగర్‌, అల్లాపూర్‌, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఇంకా కేసులు నమోదవుతున్నాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కుటుంబ సభ్యుల్లో, అపార్ట్‌మెంట్‌లో, కాలనీల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేనట్లుగా అనిపించినా కరోనా లక్షణాలున్నా వెంటనే తమను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయటకు రాకపోవడమే ఉత్తమం. అత్యవసరాల కోసం వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. తిరిగి ఇంటికి వెళ్లేముందు తప్పనిసరి బయటే చేతులను సబ్బుతో కడుక్కోవాలి. లేదంటే శానిటైజ్‌ చేసుకోవాలి. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురు చూడకుండా స్వీయ జాగ్రత్తలు పాటించడం వల్ల కరోనా కౌగిలిలోకి వెళ్లకుండా కాపాడుకోవచ్చు. జ్వరం, జలుబు, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుంటే నిర్లక్ష్యం చేయకుండా 104 కాల్‌ సెంటర్‌ను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details