కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి... ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి పోలీసులు చేస్తున్న కృషి కీలకమైనది. ప్రధాన రహదారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.... ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. రోగిని గుర్తించిన దగ్గరి నుంచి... వాళ్లను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించడం వరకూ వైద్యసిబ్బందికి వెన్నంటి ఉంటున్నారు. గాంధీ ఆస్పత్రి వద్ద షిఫ్టులవారీగా పహారా కాస్తున్నారు. కరోనా రోగి ఉన్న ప్రాంతాన్ని నియంత్రణ ప్రదేశంగా ఏర్పాటు చేస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లలో జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు... విధులు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల వలస కూలీలు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించడంతో... కూలీలను గుర్తించడం.. వారి పూర్తి వివరాలు సేకరించి రైళ్లలో వెళ్లేందుకు అనుమతి పత్రాల పంపిణీ.. వారిని దగ్గరుండి మరీ రైల్వే స్టేషన్ల దగ్గరకు ప్రత్యేక బస్సుల్లో తరలించడం సహా వారు చేయని పనిలేదు.
ఇప్పటి వరకు ఇంతమంది
ఈ క్రమంలో కొందరు పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. బుధవారం ఒక్కరోజులోనే దాదాపు 17మందికి వైరస్ పాజిటివ్ తేలింది. వీరిలో ఇన్స్పెక్టర్, ఏఎస్సై స్థాయి అధికారులు కూడా ఉన్నారు. వీళ్లందరినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు పోలీస్ శాఖలో కరోనా వైరస్ బారిన పడిన వాళ్ల సంఖ్య 29కి చేరింది. వీరిలో కుల్సుంపుర ఠాణాలో పనిచేసే కానిస్టేబుల్ మృతి చెందాడు. మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు 20మందికి కరోనా లక్షణాలు బయటపడటం వల్ల పోలీస్ ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.