తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్‌తో ఉన్నతాధికారులు, ఉద్యోగులు సతమతం - కరోనా కేసులు

రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా సెకెండ్‌ వేవ్‌ కలకలం సృష్టిస్తోంది. ఉన్నతాధికారులు సహా పలువురు ఉద్యోగులు ఈ మహమ్మారితో ఇబ్బందిపడుతున్నారు. వారం రోజులుగా దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. గత ఏడాది తొలి దశలో వచ్చిన కేసులతో పోలిస్తే రెండో దశలో ఇప్పటికే దాదాపు రెండింతలకుపైగా వస్తున్నాయి. బాధితుల్లో అత్యధికులు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. సచివాలయం నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌, పోలీస్‌, పురపాలక, అటవీశాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కేసులు పెరుగుతున్నాయి.

corona-virus-impact-on-offices-in-telangana
కొవిడ్‌తో ఉన్నతాధికారులు, ఉద్యోగులు సతమతం

By

Published : Apr 15, 2021, 6:45 AM IST

గతంలో దాదాపు ఏడాది పొడవునా పది పాజిటివ్‌లు కూడా రాని కార్యాలయాల్లో ఈ నెలలో అత్యధికంగా నమోదవుతున్నాయి. కొంతమంది మృత్యువాత పడుతుండటం ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. తొలిదశ తరహాలో జాగ్రత్తలు లేకపోవడం, మాస్కుల వంటి వాటి విషయంలో సిబ్బందిలోనూ ఉదాసీనత వైరస్‌ వ్యాప్తిని పెంచుతోంది. సమావేశాలు, సమీక్షలతో పాటు క్షేత్ర పర్యటనలు కేసులు పెరిగేందుకు కారణమవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.


ఎక్కడెక్కడ ఎలా ఉందంటే...

* బీఆర్కే భవన్‌లో గత పది రోజులుగా కలకలం కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ శాఖలకు చెందిన పలువురు అధికారులకు పాజిటివ్‌ వచ్చింది. వారితో సన్నిహితంగా ఉన్న ఉద్యోగులు, ఇతర సిబ్బందిలోనూ కొందరికి సోకింది.
* నీటిపారుదలశాఖతో పాటు, కృష్ణా బోర్డులోనూ పలువురు ఇంజినీర్లు, ఉద్యోగులకు పాజిటివ్‌గా తేలింది. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లతో పాటు, చీఫ్‌ ఇంజినీర్లు, బోర్డు ఉన్నతాధికారులకూ సోకింది.
* రాష్ట్ర ఎన్నికల సంఘంలో కమిషనర్‌ సహా 16మంది కొవిడ్‌ బారిన పడ్డారు.
* అటవీశాఖలో క్షేత్ర స్థాయి సిబ్బందితో పాటు అరణ్యభవన్‌లోనూ కేసులు నమోదవుతున్నాయి. పురపాలకశాఖ కార్యాలయంలో, అరణ్యభవన్‌లో ఒక్కో ఉద్యోగి మృతి చెందారు.
* పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల కార్పొరేషన్‌లో 12 మంది, ఆర్‌అండ్‌బీలో ఎనిమిది మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
* సంక్షేమ భవన్‌లో పాజిటివ్‌ల సంఖ్య 20 దాటింది. వ్యవసాయశాఖలో ఉన్నతాధికారులకు కాకుండా ఆరుగురికి సోకింది. ఇంటర్‌ బోర్డులో పదిమందికి, పాఠశాల విద్యాశాఖలో ఉన్నతాధికారికి ఒకరికి కరోనా నిర్ధారణ అయింది.


పోలీసు శాఖలో 250 మంది దాకా...

పోలీసు శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 250 మందిదాకా కొవిడ్‌ సోకి ఇబ్బంది పడుతున్నారు.


బ్యాంకుల్లో తగ్గిన జాగ్రత్త చర్యలు

బ్యాంకుల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. గతంలో కేసు వస్తే, వారితో పాటు మిగతా సిబ్బందికి పరీక్షలు నిర్వహించి, ఒకరోజు బ్రాంచిని శానిటైజ్‌ చేసేవారు. ఇప్పుడు ఆ స్థాయిలో చేయడం లేదు. పాజిటివ్‌ వచ్చిన ఉద్యోగిని 14 రోజుల క్వారంటైన్‌కు పంపుతున్నారు.

మరో 33,583 డోసుల పంపిణీ

తెలంగాణలో మంగళవారం మరో 33,583 కొవిడ్‌ టీకా డోసులను వైద్యఆరోగ్యశాఖ పంపిణీ చేసింది. ఇందులో తొలిడోసును 31,077 మంది, రెండోడోసును 2,506 మంది పొందారు.

ఏపీలో ఒక్కరోజే 6.17 లక్షల టీకాలు

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 6,17,182 మందికి కరోనా టీకాలు వేశారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 68,358 మందికి.. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 34,048 మందికి అందించారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో 8 వారాల్లో 25 రెట్లు పెరిగిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details