‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని ప్రముఖ ఆర్థికవేత్త కార్ల్ మార్క్స్ చెప్పినట్లు.. మానవ సంబంధాలు బాగుండాలంటే ఆర్థికాభివృద్ధి పాత్ర కూడా కీలకమే. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. ఫలితంగా ఈ ప్రభావం దాదాపు అన్ని రంగాలపై పడుతోంది. దీంతో నెలాఖరుకు అకౌంట్‌లో జీతాలు పడని వారెందరో! అకౌంట్‌లో జీతం పడకపోవడం వల్ల ఏం చేయాలో తోచక మానసిక ఒత్తిడికి గురవడం, ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక ఇంట్లో వాళ్ల మీద చూపించడం వల్ల గొడవలకు తెరలేస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో భార్యాభర్తలిద్దరూ సంయమనం పాటిస్తూ, ఒకరికొకరు తోడుగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
తోడుగా నిలవండి..
మొన్నటి వరకు నెల తిరగ్గానే అకౌంట్‌లో వేలకు వేలు జీతాలు వచ్చి పడేవి. ఇప్పుడు ఉద్యోగం కోల్పోవడం లేదా జీతాలు రాకపోవడం వల్ల ఆ ప్రభావం మనల్ని మానసికంగా కుంగదీస్తుంది. కాబట్టి భర్తకు భార్య, భార్యకు భర్త తోడుగా నిలవాల్సిన సమయం ఇదేనని గుర్తుపెట్టుకోండి. మీ భాగస్వామికి ధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేయండి. అప్పటి వరకు వేలకు వేలు సంపాదించే వ్యక్తి ఒక్కసారిగా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే.. మానసికంగా ఒత్తిడి ఎదురవడం సహజం. కాబట్టి వారిలో మానసిక స్థైర్యాన్ని నింపడంలో భార్యలదే ప్రధాన పాత్ర. అలాగే కొన్ని కుటుంబాల్లో ఖర్చులు, ఇంటి బాధ్యతల్లో భార్యలదే పైచేయిగా ఉంటుంది. అలాంటివారికి భర్తలు మద్దతుగా నిలవాలి. ప్రస్తుత రోజులు ఎప్పటికీ ఇలాగే ఉండవని.. త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగాలి. అంతేకానీ జీతం రాలేదన్న కోపాన్ని ఒకరిపై ఒకరు చూపించుకుంటే ఆ ఇల్లు నరకమే అవుతుంది తప్ప మరే ప్రయోజనం ఉండదు.
మాటే మంత్రము..
మానసిక గాయాన్ని తగ్గించేందుకు మాటను మించిన మంత్రం మరోటి ఉండదని చెబుతుంటారు. ఉద్యోగ లేమి, ఆర్థిక సంక్షోభం ద్వారా గాయపడిన మనసును మాట అనే మందుతోనే నయం చేయాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సానుకూల దృక్పథంతో కూడిన మాటలు మాట్లాడాలి. అంతేకానీ.. ఉద్యోగం లేదు.. జీతం రాలేదు.. ఇప్పుడు ఏంటి పరిస్థితి..? మన జీవనం సాగేది ఎలా? పిల్లల ఖర్చులు ఎలా వెళ్లదీయాలి? ఇలాంటి మాటలను పదే పదే తలచుకుంటూ కుంగిపోవడం అస్సలు సరికాదు. ఈ క్రమంలో దంపతులిద్దరూ తమ పాజిటివిటీని పెంచుకోవడానికి వారికి నచ్చిన పనులు చేయడం, నైపుణ్యాల్ని పెంచుకోవడానికి ఏవైనా ఆన్‌లైన్ కోర్సులు నేర్చుకోవడం.. వంటి మార్గాల్ని అన్వేషించాలి. ఫలితంగా ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది.
ఉన్నంతలో బతికేద్దాం..