Corona Virus Cases: రాష్ట్రంలో దాదాపు ఏడు నెలల పాటు స్థిరంగా నమోదవుతున్న కొవిడ్ కేసులు మళ్లీ పడగ విప్పాయి. గత వారం రోజుల్లో కేసులు అయిదు రెట్లు కావడం ఆందోళన కలిగిస్తోంది. 84 శాతం పాజిటివ్‌లు జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. అలాగే వారం క్రితం 0.73 శాతం ఉన్న పాజిటివిటీ రేటు కూడా అయిదింతలకు పైగా పెరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుత పరిణామాలు, నిపుణుల సూచనల మేరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.
కొవిడ్ నిబంధనలు పాటించకుంటే..
ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకునేలా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అదనపు పడకలను సన్నద్ధం చేస్తోంది. రెండోదశలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఇప్పుడు ప్రతి జిల్లా ఆసుపత్రిలోనూ స్వీయ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటును నెలకొల్పడంతోపాటు కొవిడ్ నిర్ధారణ కిట్లను సమకూర్చుకోవడం, కరోనా పరీక్ష కేంద్రాలను పెంచడంపై దృష్టి పెట్టింది. ఔషధాల నిల్వలపై లెక్కలు తీస్తోంది. ప్రజలంతా మాస్కులు ధరించటం, భౌతికదూరం వంటి కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని, లేకపోతే రానున్న రోజుల్లో మరింత గడ్డుకాలాన్ని ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘మనమంతా ఒమిక్రాన్ వేరియంట్ గురించి భయపడుతున్నాం కానీ మన దగ్గర ఇంకా డెల్టా వేరియంట్ పోనేలేదు. డెల్టాలో వ్యాధి లక్షణాలు మూడురోజుల్లోనే పెరిగిపోతాయి కాబట్టి ఎవరికివారు తీవ్రతను గమనించుకోవాలి’ అని ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
రెండోదశ చేదు జ్ఞాపకాలను మరవొద్దు
2021 మార్చిలో కరోనా రెండోదశ ఉద్ధృతి మొదలైంది. ఈ దశలో డెల్టా వేరియంట్ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భారీ నష్టాన్ని కలగజేసింది. ఒక్కరోజులో 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలు లభ్యంకాని దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయి. ఇప్పుడు టీకాల వల్ల భరోసా ఏర్పడింది. మాస్కు ధరిస్తే వైరస్ నుంచి రక్షణ పొందవచ్చనే స్పష్టమైన అవగాహన వచ్చింది. స్వీయ నియంత్రణతోనే కొవిడ్ నుంచి చాలావరకు తప్పించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మూడోదశ కూడా సుమారు 2 నెలలపాటు తీవ్ర ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు.