తెలంగాణ

telangana

ETV Bharat / state

CORONA: కరోనా వచ్చి తగ్గినా.. జాగ్రత్తలు తప్పనిసరి - తెలంగాణ వార్తలు

కరోనా ఒకసారి వచ్చింది.. ఇక రాదు అనే ధీమాతో ఉంటే ఇబ్బందులు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మళ్లీ సోకే ప్రమాదం ఉందని అంటున్నారు. చాలా తక్కువ మందిలో రీఇన్​ఫెక్షన్లు కనిపిస్తున్నా... అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

CORONA symptoms, covid reinfections
కరోనా, కొవిడ్ రీఇన్​ఫెక్షన్లు

By

Published : Jul 5, 2021, 9:37 AM IST

సాధారణంగా కరోనా వచ్చి తగ్గిన తర్వాత శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. ఐజీజీ పరీక్షల్లో ఈ విషయం తేలుతుంది. అయితే కొందరిలో పూర్తిగా యాంటీబాడీలు రావడం లేదు. మరికొందరిలో 2-3 నెలల తర్వాత తగ్గిపోతున్నాయి. ఇలాంటి వారు మరోసారి వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా తక్కువ మందికే ఈ ముప్పు ఉందంటున్నారు.

  • మల్కాజిగిరికు చెందిన ఓ మహిళ(42) రెండు నెలల క్రితం కరోనా బారిన పడ్డారు. చికిత్సతో కోలుకున్నారు. రెండు నెలలు దాటడంతో వ్యాక్సిన్‌ తీసుకోవాలని భావిస్తున్నారు. ఇంతలో ఆమెలో మళ్లీ కొవిడ్‌ లక్షణాలు కన్పించాయి. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తే మరోసారి వైరస్‌ నిర్ధారణ అయింది. వైద్యులను సంప్రదించారు. ప్రమాదం ఏమీ లేదని... తక్కువ లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.
  • ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో పనిచేసే వైద్యుడి వద్దకు 2 రెండు రోజుల్లో ముగ్గురు వరకు ఇలా రీ ఇన్‌ఫెక్షన్‌ సమస్యతో చికిత్సకు వచ్చారు. గతంలో వీరికి కొవిడ్‌ వచ్చి తగ్గినా...మళ్లీ ఆర్టీపీసీఆర్‌ టెస్టులో పాజిటివ్‌గా తేలింది. చికిత్స చేయడంతో కోలుకున్నారు.

కరోనా వచ్చి పోయింది... మళ్లీ వచ్చే అవకాశం లేదన్న ధీమాతో ఉంటే మాత్రం వెంటనే ఆ భావన నుంచి బయటకు రావాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా...కొందరిలో మళ్లీ సోకే ప్రమాదం ఉందనేది తాజా సంఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. వైరస్‌ తగ్గిన తర్వాత 3-6 నెలల వ్యవధిలో మళ్లీ కొందరు వైరస్‌ బారిన పడుతున్నారు. చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ ప్రభావం కన్పిస్తున్నా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

కొత్త రకం వేరియంట్లతో..

కొవిడ్‌-19 విడతల వారీగా విజృంభిస్తోంది. తొలుత ఒక వేరియంట్‌ సోకిన వారికి యాంటీబాడీలు తక్కువుంటే రెండోసారి కొత్తరకం దాడి చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వచ్చి పోయాక అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేతతో చాలామంది జాగ్రత్తలు తీసుకోకుండానే బయటకొస్తున్నారు. కొందరు మాస్క్‌లు ధరించడం లేదు. ఈ పరిస్థితి కొందరిలో రీఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతోంది. కేసులు తగ్గినంత మాత్రాన... వైరస్‌ పోయినట్లు కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

రీఇన్ఫెక్షన్‌ ప్రభావం తక్కువే...

  • ఇటీవలి కాలంలో ఒకటి అరా రీఇన్ఫెక్షన్‌ కేసులు వస్తున్నాయి. తీవ్రమైన వేరియంట్‌ అయితే తప్ఫ...అంత ప్రమాదం లేదు. స్వల్ప లక్షణాలు కన్పించినా చికిత్సతో తగ్గిపోతుంది. అయితే కొన్ని వేరియంట్లు మాత్రం ప్రభావం చూపే అవకాశం ఉంది.
  • ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలు కన్పించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్‌గా వచ్చి లక్షణాలు తక్కువగా ఉంటే ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకోవచ్చు. ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గినప్పుడు మాత్రం ఆస్పత్రిలో చేరాలి.
  • ఒకసారి కొవిడ్‌ వచ్చి తగ్గిన తర్వాత రెండు నెలల అనంతరం వీలైతే ఐజీజీ యాంటీబాడీల టెస్టు చేయించుకోవాలి. ఇందులో పాజిటివ్‌ వస్తే... మరో 2-3 నెలల వరకు కరోనా సోకే ప్రమాదం తక్కువ. అనంతరం టీకా తీసుకుంటే మరికొన్నాళ్లు యాంటీబాడీలు శరీరంలో ఉంటాయి.
  • కొందరిలో వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత కూడా యాంటీబాడీలు వృద్ధి కావడం లేదు. వ్యాక్సిన్‌ తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటోంది. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించి బూస్టర్‌ డోసు తీసుకోవడం ఉత్తమం.

ఇదీ చదవండి:99 శాతం కరోనా మరణాలు వారిలోనే!

ABOUT THE AUTHOR

...view details