ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ విమ్స్ ఆసుపత్రిలో కరోనా రోగులు పడుతున్న కష్టాలపై అక్కడ చికిత్స పొందుతున్న ఓ కరోనా బాధితుడు విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. ఆసుపత్రిలో నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. కళ్లెదుటే తోటి కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని.. పట్టించుకునే నాథుడే లేడని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ప్రాణాలతో ఇంటికి చేరుకుంటామో లేదోనని భయాందోళన వ్యక్తం చేశాడు.
నా కళ్లెదుటే ఓ కరోనా బాధితుడు రాత్రంతా అరిచి.. అరిచి ప్రాణాలు కోల్పోయాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇక్కడ అన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయి. కానీ పట్టించుకోవడానికి ఎవరూ లేరు. అలాంటప్పుడు రోగులను చేర్చుకుని ఎందుకు వారి ప్రాణాలతో ఆడుకుంటారు. చాలా బాధగా ఉంది. నాకు పిల్లలున్నారు. ఇంటికి వెళ్తానో లేదోనని భయంగా ఉంది. అప్పుడప్పుడు వచ్చి మాత్రలు ఇచ్చేసి వెళ్తున్నారు. ఒక్క దుప్పటి కూడా ఇవ్వటం లేదు. బాత్రూమ్లు మరీ అధ్వానంగా ఉన్నాయి. కరోనా కంటే ముందే ఆసుపత్రి చూసి వైరస్ బాధితులు చనిపోయేలా ఉన్నారు. ఎవరైనా చనిపోతే కనీసం శానిటైజ్ చేయకుండా ఆ బెడ్లను మరొకరికి ఇస్తున్నారు.