రాష్ట్రంలో ఇప్పటివరకు కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు మొత్తం 54 లక్షల డోసులపైగానే వేశారు. ఏ వ్యాక్సిన్ అయినా ప్రతి వ్యక్తికి 0.5 మిల్లీ లీటర్ల డోసును ఇంజక్షన్ రూపంలో ఇవ్వాల్సి ఉంది. ఇక్కడే కొంతమంది వైద్య సిబ్బంది దూరదృష్టితో ఆలోచించారు. టీకా పంపిణీ కేంద్రాల వద్ద తీవ్రమైన రద్దీ నెలకొంటోంది. టీకా వేస్తే అదే పదివేలు అన్న రీతిలో చాలామంది ఆత్రుతలో ఉంటారు. ఎంత డోసు ఇచ్చారన్న విషయాన్ని పట్టించుకోరు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొన్ని కేంద్రాల్లోని సిబ్బంది టీకా డోసును కొందరికి తక్కువ మోతాదులో ఇవ్వడం మొదలుపెట్టారు.
టీకా వేసుకున్న వ్యక్తి ఎంత డోసు తమ శరీరంలోకి వెళ్లిందన్నది పరిశీలించే అవకాశం లేదు. చాలామందికి నిర్ణీత మోతాదులో వ్యాక్సిన్ లోడు చేశారా లేదా అన్న విషయం కూడా తెలియదు. దీన్ని ఆసరాగా తీసుకుని కొద్దిరోజులుగా నగరంలోని కొన్ని కేంద్రాల్లో తక్కువ డోసు ఇస్తున్నారన్న విషయం బహిర్గతమైంది. తక్కువ డోసు ఇవ్వగా మిగిలిన టీకాను దర్జాగా బయట వారికి వేసి సొమ్ము చేసుకుంటున్నారు. వారం కిందట అత్తాపూర్‌లో కొంతమంది వైద్య సిబ్బంది కొన్ని అపార్టుమెంట్లకు వచ్చి ఒక్కో డోసు రూ.400 చొప్పున రేటు నిర్ణయించి అనేకమందికి వేశారన్న విషయం వెలుగులోకి వచ్చింది. అత్తాపూర్ ప్రాంతంలోని ఓ టీకా పంపిణీ సెంటర్‌కు వచ్చిన ఓ ప్రముఖుడు అనుమానం వచ్చి దీనిపై ఆరా తీస్తే ఈ మొత్తం వ్యవహారం బయటపడింది.