రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి సోమవారం వరకు కొవిడ్ వ్యాక్సినేషన్(covid vaccination) ప్రక్రియను నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15న దసరా ఆ తర్వాత వరుసగా, శని ఆదివారాలు రావటంతో 14వ తేదీన కూడా వ్యాక్సినేషన్(corona vaccination)కి విరామం ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఈ నెల 14 నుంచి 17 వరకు టీకా కార్యక్రమానికి విరామం ప్రకటించాలని సీఎస్‌ను ఆదేశించారు. ఈ మేరకు టీకాను నాలుగు రోజులపాటు నిలిపివేస్తూ.. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు ఆదేశాలు పంపించింది. దీంతో గురువారం నుంచి నాలుగు రోజులపాటు టీకా కేంద్రాలు మూతపడనున్నాయి. ప్రజలు ఆదివారం వరకు వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి ఇబ్బంది పడొద్దని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కోరారు.
ఎన్నికల దృష్ట్యా హుజూరాబాద్ నియోజకవర్గంలో..
హుజూరాబాద్ ఉపఎన్నిక దృష్ట్యా ఆ నియోజకవర్గంలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. ఈ నెల 14, 15, 16, 17 తేదీల్లో హుజూరాబాద్, జమ్మికుంట ఏరియా ఆస్పత్రులతో పాటు చెల్పూర్, వీణవంక, వావిలాల, ఇల్లందకుంటలో కొవిడ్ టీకా కార్యక్రమం సాగనుంది.
అతలాకుతలం చేసిన మహమ్మారి
గతేడాది మార్చి నెలలో తొలిసారి రాష్ట్రంలో వెలుగు చూసిన కరోనా వైరస్(corona virus) ఇప్పటికే రెండు వేవ్‌ల రూపంలో ప్రజలను అతలాకుతలం చేసింది. ఆర్థికంగా, శారీరకంగా కుంగదీసింది. వందల మంది చిన్నారులను దిక్కులేని అనాథలుగా మార్చింది. అందరూ ఉన్నా.. కరోనాతో మరణించిన వారికి కనీసం సరైన అంతిమ సంస్కారాలు జరిపే అవకాశం లేని దుస్థితిని తీసుకొచ్చింది. ఈ కష్టాన్ని అడ్డుకునే లక్ష్యంతో ఈ ఏడాది జనవరి నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది. వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తూ.. తెలంగాణ ప్రభుత్వం టీకాల(corona vaccine)ను పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. జనాభా ప్రాతిపదికన చూసినా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా టీకాలు అందించింది. రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దసరా పండుగతో పాటు శని, ఆదివారాలు రావటంతో నాలుగు రోజులు వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తూ తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: CORONA VACCINE: భాగ్యనగరంలో మూతపడిన సగం కరోనా టీకా కేంద్రాలు