కరోనా వైరస్ హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కూడా పెద్దసంఖ్యలో కరోనా భారిన పడుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని కొన్ని విభాగాలు నడుస్తోన్న బేగంపేట మెట్రో రైల్ భవన్లో ఓ ఉద్యోగికి కరోనా నిర్దారణ అయింది. దీంతో ఆ భవనంలోని ఓ అంతస్థు మొత్తం ఖాళీ చేయించారు. ఇటీవలే సీఎంవోలో పనిచేస్తున్న ఉద్యోగి కుమారుడు ముంబయి నుంచి రావడం వల్ల అతని నుంచి తండ్రికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇక్కడ పనిచేస్తున్న పలు శాఖల అధికారులు, సిబ్బంది 30మందిని క్వారంటైన్‌కు పంపారు. అనంతరం కార్యాలయాన్ని బల్దియా అధికారులు స్ప్సేయింగ్ చేశారు. ఓ ఉద్యోగికి కరోనా సోకడం వల్ల సీఎంవో కార్యాలయంలో ఆందోళన నెలకొంది.
పలువురికి కరోనా..
శివాజీ నగర్ బస్తీలో ఉంటున్న హాబీబ్ నగర్ పీఎస్ ఎస్సైకి కరోనా పాజిటివ్ రావడం వల్ల ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్ శ్రీ శ్రీనివాసపురం కాలనీలో ఓ వైద్యునికి కరోనా నిర్దారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. అల్లాపూర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్లో ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. వైరస్ సోకిన వారిని గాంధీ హాస్పిటల్ కి తరలించగా.. కుటుంబ సభ్యులందరిని హోమ్ క్వారంటైన్లో ఉంచారు.