కొవిడ్ బారిన పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను కలిసి టీఎన్జీఓ నేతలు మెమోరాండం సమర్పించారు. జూన్ నెలలో పూర్తి వేతనాలు చెల్లించినందుకు ముఖ్యమంత్రి సహా మంత్రులు హరీశ్ రావు, మంత్రి కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామక్రిష్ణారావు తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రాణాలు పణంగా పెట్టి..
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉద్యోగులు తమ ప్రాణాలు పణంగా పెట్టి కొవిడ్ విధులు నిర్వహిస్తున్నారని ఐకాస ఛైర్మన్ కారెం రవీందర్‌రెడ్డి అన్నారు. రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల మధ్య విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారన్నారు.
వారికి స్పెషల్ లీవ్ ఇవ్వాలి..
కొవిడ్ వైరస్ సోకిన ఉద్యోగులకు వైద్య సేవలను ఈహెచ్ఎస్ కోటాలో అందించాలని సంఘం నేతలు కోరారు. కరోనా వైరస్ సోకి వైద్యసేవలు పొందుతున్న ఉద్యోగులకు వెంటనే ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం దగ్గర శరీర ఉష్ణోగ్రత నమోదు చేయడం, మాస్కులు ధరించిన వారినే లోనికి అనుమతించడం, శానిటైజర్లు తప్పనిసరిగా వినియోగించడం, ప్రతి వారం కార్యాలయ ఆవరణలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయాలన్నారు.
5 రోజులే ఉండాలి..
ఉద్యోగులను రొటేషన్ పద్ధతిలో కార్యాలయాలకు అనుమతించాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాల్లో 5 రోజుల పనిదినాలు ప్రవేశపెట్టడం ద్వారా మహమ్మారిని నియంత్రించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉచితంగా కొవిడ్ టెస్టులు నిర్వహించాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల ఐకాస ఇచ్చిన మెమెురాండంలోని అంశాలపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కారెం రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : ప్రపంచంపై కొవిడ్ పంజా- కోటి 10 లక్షల కేసులు