ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొవిడ్ చికిత్సలు చేయాలని ప్రైవేటు ఆస్పత్రుల్ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలను ఫీజుల కోసం వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు.
ప్రైవేటు వైద్య కళాశాలల్లో 14 వేలకు పైగా పడకలు ఉన్నాయని మంత్రి ఈటల వెల్లడించారు. సరిపడా ఔషధాలు, ఆక్సిజన్ సరఫరా చేయాలని ప్రైవేటు యాజమాన్యాలు కోరగా...అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. గతంలో మాదిరి అందరికీ పీపీఈ కిట్లు అవసరం లేదని... వైద్యులు పీపీఈ కిట్ లేకుండా, మాస్క్ ధరించి మాత్రమే రోగుల వద్దకు వెళ్లగలుగుతున్నారని ఈటల వివరించారు. మాస్క్ శ్రీరామ రక్ష అని పునరుద్ఘాటించారు.