Corona Spread: కరోనా చెలరేగిపోతోంది. 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,59,632 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 224 రోజుల తర్వాత ఇదే అత్యధికం. గత ఏడాది మే 29న 1,65,553 కేసులు వెలుగుచూశాయి. తాజావాటితో కలిపి క్రియాశీల కేసులు 5,90,611కి (1.66 శాతానికి), రోజువారీ సగటు పాజిటివిటీ 10.21 శాతానికి చేరాయి. గత 197 రోజుల్లో ఇదే గరిష్ఠం. ఒకరోజు వ్యవధిలో 327 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోవడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 4,83,790కి చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 96.98 శాతానికి తగ్గింది. కొత్తగా 552 మందిలో ఒమిక్రాన్ రకం వెలుగు చూసింది. ఈ వేరియంట్ బయటపడినవారి సంఖ్య 3,623కి చేరిందని, వీరిలో 1,409 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. అత్యధిక ఒమిక్రాన్ కేసులు (1,009) మహారాష్ట్రలోనే ఉన్నాయి.
సందర్శకుల్ని కలవకపోతే మేలు
పార్లమెంట్ సిబ్బందిపైనా కరోనా విరుచుకుపడింది. కొవిడ్-19 పరీక్షల్లో లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో మరో 40 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో వీరి సంఖ్య 400కి చేరింది. అండర్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ అధికారి కంటే కింది స్థాయి ఉద్యోగుల్లో 50 శాతం మంది ఇంటి నుంచే పనిచేయాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశించింది. ఉద్యోగుల్లో గర్భిణులు, దివ్యాంగులు కార్యాలయానికి రానవసరం లేదని, ఇంటి నుంచి పనిచేస్తే సరిపోతుందని తెలిపింది. అధికారిక సమావేశాలను వీలైనంత మేర వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా నిర్వహించుకోవాలని, అత్యవసరమైతే తప్ప సందర్శకులను కలవొద్దని ఉద్యోగులకు సూచించింది. ఈ నిబంధనలు ఈ నెలాఖరు వరకు అమల్లో ఉంటాయని తెలిపింది.
పరిస్థితి సమీక్షించిన వెంకయ్యనాయుడు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు, అనుబంధ సేవల విభాగాలకు చెందిన మరో 40 మందికి కరోనా సోకింది. దీంతో వీరి సంఖ్య 400కి చేరింది. ఇందులో 200 మంది లోక్‌సభ సిబ్బంది కాగా, 65 మంది రాజ్యసభకు చెందిన వారు. 133 మంది అనుబంధ సేవల విభాగ ఉద్యోగులు. భారీగా కేసులు వెలుగులోకి రావడంతో రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు పరిస్థితిని సమీక్షించారు.
అమృత్‌సర్ ప్రయోగశాలపై విచారణ
రోమ్ నుంచి అమృత్‌సర్‌కు శుక్రవారం వచ్చిన అద్దె విమానంలో 173 మంది కరోనా పాజిటివ్ అని నిర్ధారించిన ప్రైవేటు ప్రయోగశాలపై విచారణకు పంజాబ్ ప్రభుత్వం ఆదేశించింది. తమకు కరోనా ఉన్నట్లు వెలువడిన నివేదికలు తప్పు అని పలువురు ప్రయాణికులు ఆరోపించడం దీనికి కారణం. విమానం ఎక్కేముందు చేసిన పరీక్షలో తమకు నెగెటివ్ వచ్చిందని వారు చెప్పారు.
సుప్రీంకోర్టులో 5% సిబ్బందికి పాజిటివ్
సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తులు, 5% సిబ్బంది కరోనా బారిన పడ్డారు. సర్వోన్నత న్యాయస్థానంలో 32 మంది జడ్జీలు, దాదాపు 3,000 మంది సిబ్బంది ఉన్నారు. సిబ్బందిలో దాదాపు 150 మంది పాజిటివ్‌గా తేలారు. కోర్టు ఆవరణలో కరోనా పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఏమాత్రం కరోనా లక్షణాలున్నా కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, వారి సిబ్బంది ఈ కేంద్రంలో పరీక్ష చేయించుకోవాలని అధికారిక ఉత్తర్వు పేర్కొంది.
ఆంక్షలు విధిస్తున్న రాష్ట్రాలు
మహారాష్ట్రలో వ్యాయామశాలలు, సౌందర్యశాలలు 50% సామర్థ్యంతో పనిచేసేలా ఆంక్షల్ని సవరించారు. ఎక్కువమంది ఒకేచోట గుమిగూడకుండా మాత్రం క్రమేపీ ఆంక్షలు విధించనున్నారు. ప్రార్థన స్థలాలు, మద్యం దుకాణాలు వంటివాటికి ఇవి వర్తిస్తాయి. ఆసుపత్రి పడకలకు, ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగితే కఠినమైన ఆంక్షలు విధిస్తారు. రాజస్థాన్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ఈ నెల 30 వరకు పాఠశాలల్ని మూసివేయనుంది. పుదుచ్చేరి కూడా 9వ తరగతి వరకు పిల్లలకు క్లాసులు రద్దు చేసింది. తమిళనాడులో ఒక రోజంతా లాక్‌డౌన్ విధించారు. పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. ప్రజలు మాస్కులు ధరిస్తూఉంటే లాక్‌డౌన్ అవసరం ప్రస్తుతానికి ఉండదని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.
- అంతర్జాతీయ సరిహద్దులో సుచేత్‌గఢ్ ఔట్‌పోస్ట్ వద్ద వారాంతాల్లో బీఎస్‌ఎఫ్ నిర్వహించే ‘బీటింగ్ రిట్రీట్’ కార్యక్రమాన్ని కరోనా దృష్ట్యా తాత్కాలికంగా రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు గత అక్టోబర్ నుంచి దీనిని ప్రారంభించారు.
ఇదీ చూడండి:Booster Dose Vaccination: ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో బూస్టర్ డోసుల పంపిణీ.. వ్యక్తిగత ఇష్టంతోనే టీకా..