తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజారోగ్య నిర్లక్ష్యం..పెరిగిన ప్రాణనష్టం

పట్టించుకున్న చోట కరోనా వ్యాధి త్వరగా అదుపులోకి వచ్చిందని ది ఇండియా ఫోరం ప్రచురించిన ఓ వ్యాసంలో పేర్కొంది. దేశంలో ఏడాది వ్యవధిలో వచ్చిన పర్యవసానాలపై.. వివిధ రంగాలకు చెందిన 24 మంది ప్రముఖులు రాసిన వ్యాసాలతో కూడిన సంకలనాన్ని ది ఇండియా ఫోరం-ఓరియంట్‌ బ్లాక్‌ స్వాన్‌ ప్రచురించాయి. కరోనా నియంత్రణలో భాగాంగా కొవిడ్​ నిబంధనలు నిర్లక్ష్యం వహించిన ప్రాంతాల్లో కరోనా పెద్ద ఎత్తున వ్యాపించిందని పేర్కొన్నారు.

Corona spreading public health neglect covid rules
ప్రజారోగ్య నిర్లక్ష్యం..పెరిగిన ప్రాణనష్టం

By

Published : Apr 3, 2021, 6:49 AM IST

‘‘దీర్ఘకాలంగా ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్రాలు కరోనా వైరస్‌ను నిరోధించడంలో చాలా కష్టపడ్డాయి. దశాబ్దాలుగా పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన అనేక కార్యక్రమాల ఫలితాలను కొవిడ్‌ మళ్లీ వెనక్కు నెట్టింది. ఆర్థిక రంగంపై తీవ్రమైన ప్రభావం చూపింది’’ అని దేశంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు పేర్కొన్నారు. దేశంలో కరోనా.. ఏడాదిలో పర్యవసానాలపై వివిధ రంగాలకు చెందిన 24 మంది ప్రముఖులు రాసిన వ్యాసాలతో కూడిన సంకలనాన్ని ది ఇండియా ఫోరం - ఓరియంట్‌ బ్లాక్‌ స్వాన్‌ ప్రచురించాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు, జేఎన్‌యూ మాజీ ఆచార్యులు సీపీ చంద్రశేఖర్‌, ఉపేంద్రభక్షి, హర్షమందిర్‌, ఎం.గోవిందరావు, థామస్‌ అబ్రహం, సి.రామమనోహర్‌రెడ్డి, గాయత్రి నాయర్‌, ఆర్‌.నాగరాజ్‌ తదితరులు ఆరోగ్య, ఆర్థిక రంగాల్లో ప్రభావాన్ని సమగ్రంగా వివరించారు.

అమెరికాలో ఆరోగ్య రంగం ప్రైవేటీకరణతో..
*ప్రజారోగ్యం, సంక్షేమ రంగాలకు అనేక సంవత్సరాలుగా సరైన కేటాయింపులు లేకపోవడం, నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగిన నష్టం కరోనా సమయంలో బయటపడింది. అమెరికాలో కొవిడ్‌ విస్తరించిన తీరు, అధిక మరణాలను పరిశీలిస్తే ఆరోగ్య రంగం ప్రైవేటీకరణ, అధిక ఖర్చుతో కూడిన వైద్యం దుష్ప్రభావాలు స్పష్టంగా కనిపించాయి.

* దేశంలో కూడా రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు బయటపడ్డాయి. కేరళ ప్రజారోగ్యం, సంక్షేమ రంగాలపై పెట్టిన శ్రద్ధ వల్ల కొవిడ్‌ మరణాలను తగ్గించగలిగింది.

ప్రపంచంలోనే చాలా తీవ్రమైన లాక్‌డౌన్‌

* దేశంలో 2020, మార్చి 25 నుంచి మే ఒకటి వరకు విధించిన లాక్‌డౌన్‌ ప్రపంచంలోనే చాలా తీవ్రమైంది. సడలింపుల తర్వాత కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. కరోనాకు సంబంధించిన అన్ని బాధ్యతలను రాష్ట్రాలు మోయాల్సి వచ్చింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు సరైన సాయం అందలేదు.
*ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. లాక్‌డౌన్‌ ఉన్న తొలి త్రైమాసికం 2020 ఏప్రిల్‌-జూన్‌లో వృద్ధి రేటు మైనస్‌ 23.9గా నమోదైంది.
* నిరుద్యోగ రేటు 2020 ఏప్రిల్‌లో 23.5 శాతానికి చేరితే మే నెలలో 21.7 శాతంగా నమోదైంది.

కేంద్రం వెచ్చించింది తక్కువే

* కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది చాలా తక్కువే. ఐ.ఎం.ఎఫ్‌. ప్రకారం 2020 సెప్టెంబరు వరకు జీడీపీలో 1.8 శాతాన్ని అదనంగా ఖర్చు చేసింది. వడ్డీ లాంటివి రద్దు, క్రెడిట్‌ గ్యారంటీలు కలిపి మరో 5.2 శాతం. మొత్తమ్మీద జీడీపీలో ఏడు శాతం ఖర్చు చేసింది.
* ఆసియా దేశాల్లో ఏడాదిలో జీడీపీ వృద్ధి బంగ్లాదేశ్‌లో 3.8, చైనాలో 1.9, వియత్నాంలో 1.6 శాతం కాగా, మిగిలిన అన్ని దేశాలు మైనస్‌లోనే ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మైనస్‌ 10.3 శాతంతో భారతదేశం చివరన ఉంది.
* కొవిడ్‌ మరణాలు కూడా భారతదేశంలోనే అధికం. ప్రతి పది లక్షల మందికి 83గా నమోదయ్యాయి. తర్వాత స్థానంలో 46 మందితో ఇండోనేసియా ఉంది. ఇలా ఏడాదిలో కొవిడ్‌కు సంబంధించిన అనేక అంశాలను ప్రముఖులు ప్రస్తావించారు.

ఇదీ చూడండి :త్వరలో సర్కారు బడులకు సరికొత్త హంగులు!

ABOUT THE AUTHOR

...view details